రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఎందుకు బలపడుతారో ఎవ్వరికి తెలియదు. దుబ్బాక ఉప ఎన్నికలు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేశాయి. తమకు పోటీనే లేదనుకున్న టీఆర్ఎస్ నాయకులకు, కేసీఆర్, కేటీఆర్ లకు బీజేపీ ఝలక్ ఇస్తుంది. ఎంతలా అంటే ఒక్కసారిగా కాంగ్రెస్ కంటే కూడా బలంగా మారి టీఆర్ఎస్ ను పరుగులు పెట్టిస్తుంది. మొన్నటి వరకు తెలంగాణలో టీఆర్ఎస్ ను ఢీకొట్టేది కేవలం కాంగ్రెసని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు బీజేపీ కొత్తగా వచ్చి కేసీఆర్ కు నిద్రపట్టనివ్వడం లేదు.
బీజేపీని లైట్ తీసుకున్న కేసీఆర్
తెలంగాణలో తనకు కేవలం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ నుండి మాత్రమే పోటీ ఉంటుందని అనుకున్న కేసీఆర్ అధికారంలోకి వచ్చిన్నప్పటి నుండి కాంగ్రెస్ ను బలహీనపరుస్తూనే ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పై దృష్టి పెట్టిన కేసీఆర్ బీజేపీని మర్చిపోయారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ బలపడింది. పార్లమెంట్ ఎన్నికల్లోనే కేసీఆర్ కూతురును ఓడించి, మిగితా మూడు చోట్ల గెలిచినప్పుడు కేసీఆర్ బీజేపీని గుర్తించాడు.కానీ అప్పటికే బీజేపీ తెలంగాణాలో స్థిరపరుచుకోవడానికి దారి సిద్ధం చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల తరువాత కూడా కేసీఆర్ రాష్ట్ర బీజేపీ నాయకులను పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే పార్లమెంట్ కాబట్టి మోడీని చూసి ఓటు వేశారని అనుకున్నాడు కానీ దుబ్బాక ఎన్నికల ఫలితాలు బీజేపీ రాష్ట్ర నాయకులను కూడా ప్రజలు నమ్ముతున్నారని అర్ధం అవుతుంది.
బీజేపీ నుండి టీఆర్ఎస్ తప్పించుకోగలదా??
తెలంగాణలో బీజేపీ హవా మొదలైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది కానీ ఆ గెలుపును టీఆర్ఎస్ నేతలు కూడా సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే అసలు దారి దాపుల్లోకి కూడా రాని బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. దేశం మొత్తం మోడీ హవా నడిచినా కూడా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కష్టమని అందరు భావించారు కానీ ఇప్పుడు బీజేపీ వేస్తున్న వ్యూహాలు చూస్తుంటే బీజేపీ రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా స్థిరపడనుందని సంకేతాలు ఇస్తుంది. ఈ మోడీ, బీజేపీ హవా నుండి తెలంగాణలో టీఆర్ఎస్ ఎలా తప్పించుకొని అధికారాన్ని చేపట్టనుందో వేచి చూడాలి.