పరిపాలన వికేంద్రీకరణతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ర్టంలో ఆ మూడు జిల్లాలకు విరోధి అయిన మాట వాస్తవం. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా వాసుల్లో కొంత మంది జగన్ పేరెత్తితేనే ఇప్పుడు భగ్గుమనే పరిస్థితి ఉంది. కేవలం పరిపాలనా రాజధానిగా వైజాగ్ ని చేయడం, న్యాయ రాజధానిగా కర్నూల్ ని చేయడమే జగన్ చేసిన అతి పెద్ద పాపంగా ఆ జిల్లాలో కొంత మంది నాయకులు గగ్గోలు పెడుతున్నారు. ఏ నాయకుడికైనా ఇలాంటి వ్యతిరేకత వ్యక్తమైనప్పుడు రాజకీయంగా ఆ ప్రాంతాల్లో దెబ్బతినే అవకాశం ఉంటుంది. 2024 ఎన్నికల్లో ఆ జిల్లాల్లో జగన్ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడే చెప్పడం కష్టం.
అయితే ఈ లోపు ఆ జిల్లా వాసుల్ని, స్థానిక, కీలక నాయకుల్ని జగన్ తనవైపు తిప్పుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఎంతైనా ఉంది.అందుకు జగన్ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారు అన్నది పక్కనబెడితే! ఇప్పుడు ఆ మూడు జిల్లాల నుంచి వచ్చే వ్యతిరేకతను తమ పార్టీ నేతలతో తిప్పి కొట్టించాలి. అందుకు స్థానికంగా జగన్ కమ్మ సామాజిక వర్గం నేతల్నే టార్గెట్ చేసి ప్రతిపక్షం మీదకు బాణాల్లా వదలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జగన్ అదే సామాజిక వర్గానికి చెందిన నేతలకి తమ పార్టీలో పెద్ద పీట వేయాలని భావిస్తున్నారుట. మాటకు మాట..దెబ్బకు దెబ్బ కొట్టేలా తమను వ్యతిరేకించిన సామాజిక వర్గం నేతలతోనే తిప్పికొట్టించేలా పావులు కదుపుతున్నారుట.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, ప్రకాశం జిల్లాకు చెందిన గొట్టిపాటి భరత్ , దేవినేని అవినాష్ ని రంగంలోకి దించి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న కమ్మ నాయకుల భరతం పట్టించాలని సన్నాహాలు చేస్తున్నారుట. అయితే వీళ్లందర్నీ అధికారికంగా పార్టీ కండువా కప్పుకున్న తర్వాత వార్ లోకి దింపుతారా? అంతకు ముందే సీన్ లోకి తీసుకొ చ్చి ప్రతి దాడి యుద్ధం మొదలు పెడతారా? అన్నది చూడాలి. అయితే ఈ పని జగన్ ఎంత వేగంగా చేస్తే అంత మంచిదని పార్టీ పెద్దలు సైతం భావిస్తున్నారు.