Cinema Tickets : సినిమా టిక్కెట్లు, సిమెంటు, హెరిటేజ్ పాల రాజకీయం.!

Cinema Tickets

Cinema Tickets : చిత్ర విచిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ‘భీమ్లానాయక్’ సినిమా కోసం అంత యాగీ చెయ్యాలా.? అధికార వైసీపీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మధ్య ‘భీమ్లానాయక్‘ రచ్చ జరుగుతోంది. సందట్లో సడేమియా సినిమా టిక్కెట్ల వ్యవహారంతోపాటు, సిమెంటు ధరల అంశం కూడా చర్చకు వస్తోంది. దాంతోపాటుగానే, హెరిటేజ్ పాల ధరల అంశం గురించీ చర్చ జరుగుతోంది.

సినిమా టిక్కెట్లు (Cinema Tickets) , పాలు, సిమెంట్ ధరలు.. వీటిల్లో ఏది ముఖ్యం.? ముమ్మాటికీ పాల ధరలే ముఖ్యం. ఆ తర్వాత సిమెంట్ ధరలు. చివరిగా సినిమా టిక్కెట్ల అంశం. కానీ, సినిమా టిక్కెట్ల గురించి పెద్ద రచ్చ జరుగుతోంది. మార్కెట్లో పాల ధరలు సామాన్యులకు అందుబాటులో వున్నాయా.? లేవాయె. సిమెంటు ధరల సంగతి సరే సరి.

అసలంటూ పెట్రో ధరలు తగ్గితే ఆ ప్రభావం అన్ని రంగాలపైనా పడి.. సామాన్యుడి బతుకు ఒకింత మెరుగుపడుతుంది. కానీ, పెట్రో ధరల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ మార్గాన్నే ఎంచుకున్నాయి. దాన్నెవరూ ప్రశ్నించరు.. అవి సామాన్యులకు అందుబాటులో వుండాలని కూడా ఏ రాజకీయ పార్టీ చిత్తశుద్ధితో కోరుకోవడంలేదు.

ఇక, రాష్ట్రంలో సవాలక్ష సమస్యలుంటే.. వాటిని పట్టించుకోకుండా ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు, సినిమా టిక్కెట్ల అంశం గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ పెద్దలదీ అదే పరిస్థితి. మార్కెట్లో ధరలు అదుపు చేయాల్సిన అంశాలు చాలానే వున్నాయ్.. అవన్నీ వదిలేసి, సినిమా టిక్కెట్ల మీద పడింది అధికార యంత్రాంగం.

సోషల్ మీడియాలో అయినా, పొలిటికల్ చర్చా కార్యక్రమాల్లో అయినా, పొలిటికల్ ప్రెస్ మీట్లలో అయినా, పొలిటికల్ జూమ్ మీటింగుల్లో అయినా.. ప్రజా సమస్యల గురించి చర్చ జరగట్లేదు.. సినిమా టిక్కెట్ల గురించి నడుస్తోంది రగడ. మూడు రోజుల ముచ్చట సినిమా.. పోనీ, ఓ వారం రోజుల వ్యవహారం. దానికే ఇంత రాజకీయ రాద్ధాంతమా.?