Political Ragada : ఓ సినిమా పట్ల ఇంత రాజకీయ రాద్ధాంతం అవసరమా.? అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు విస్తుపోతున్నారు. రాష్ట్రానికి రాజధాని లేదు.. విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటు పరం అయిపోతోంది.. పోలవరం ప్రాజెక్టు పూర్తవడం లేదు.. ఇంకా చాలా సమస్యలున్నాయి. వాటిపై ఏ మంత్రి కూడా గట్టిగా కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారు.
‘భీమ్లానాయక్’ సినిమా వివాదం గురించి మాత్రం ఓ కీలక మంత్రి మీడియా ముందుకొచ్చేసి, టీడీపీని నిలదీసేశారు.. జనసేన అధినేత, ‘భీమ్లానాయక్’ సినిమా హీరో పవన్ కళ్యాణ్‌ని నిలదీసేశారు. అసలేం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (Political Ragada) .? ఇదే ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది.
ఓ వైపు జిల్లాల విభజన.. దానికి సంబంధించిన రచ్చ జరుగుతోంది. ఈ విషయమై ఆయా జిల్లాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు సరిగ్గా పెదవి విప్పలేకపోతున్నారు. ఆయా మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో చాలా చాలా సమస్యలున్నాయి.. అవేవీ ఏ మంత్రికీ పట్టడంలేదు.
నిజానికి, ‘భీమ్లానాయక్’ సినిమా విషయమై ప్రభుత్వం లైట్ తీసుకుని వుంటే బావుండేది. టిక్కెట్ల విషయమై యాగీ జరుగుతోంది.. థియేటర్లలో తనిఖీలపై రచ్చ కూడా జరుగుతోంది. ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతే.. జనం కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదేమో.
సినిమా రిలీజైన రోజు సాయంత్రం ఓ మంత్రిగారు మీడియా ముందుకు రావడంతో, సినిమాపై ప్రభుత్వం కక్ష కట్టిందన్న ప్రచారానికి బలం చేకూనిట్లయ్యింది.