వైసీపీ ఎమ్మెల్యేకి సీఐడీ నోటీసులు… ఎందుకంటే ?

Will Jagan do justice for ycp activists?

అమరావతి భూముల కుంభకోణం ఆరోపణల కేసు విషయంలో ఏపీ సీఐడీ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పి.నారాయణలకు సీఆర్పీసీ 41 సెక్షన్ల కింద నోటీసులు జారీ చేసిన సీఐడీ.. తాజాగా వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. అమరావతి అసైన్డ్ భూముల విక్రయాల వెనుక భారీ కుంభకోణం జరిగిందని.. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు ఆయనకే సీఐడీ అధికారులు నోటీసులు పంపారు.సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఎమ్మెల్యేలకు సీఐడీ అధికారులు నోటీసులు పంపారు. అమరావతి భూముల కుంభకోణంపై ఫిర్యాదు చేసిన.. ఆయన దగ్గర ఆధారాలు ఏమున్నాయో చూపించాలి అంటూ ఈ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే సీఆర్పీసీ 41 కింద ఈ నెల 22న నారాయణ, 23న చంద్రబాబు హాజరు కావాలి అంటూ నోటీసులు ఇచ్చారు అధికారులు.

తాజాగా ఆర్కేకు నోటీసులు ఇస్తూ.. రేపు ఉదయం 11 గంటలకు సీఐడీ కార్యాలయానికి సూచించారు. ఆయన ఇచ్చే ఆధారాలు బట్టే.. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలను సీఐడీ అధికారులు విచారించనున్నారు. సోమవారం ఉదయమే హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి మరి ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరుకావలసిందిగా కోరుతూ 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. చంద్రబాబుపై 120బి, 166, 167, 217 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకు కూడా 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు సీఐడీ అధికారులు.

తనకు వచ్చిన సీఐడీ నోటీసులపై హైకోర్టుకు వెళ్లే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం న్యాయనిపుణులతో సమావేశమైన చంద్రబాబు.. వారి దగ్గర నుంచి సలహాలు తీసుకున్నారు. వారి సలహా ప్రకారమే గురువారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. తనపై నమోదైన కేసుకు సంబంధించిన.. ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేయాలని కోరనున్నట్లు సమాచారం.
మరోవైపు మాజీ మంత్రి నారాయణకు నోటీసులివ్వడంతో పాటు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్ సహా మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు చేశారు. నారాయణకు చెందిన నివాసాలతో పాటు కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించారు. అన్ని చోట్లా ఏకకాలంలో సోదాలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి ఇన్ని చోట్ల సీఐడీ సోదాలు జరగడం సంచలనంగా మారింది.

అలాగే హైదరాబాద్ కూకట్ పల్లిలోని లోథా బిల్డర్స్ లోని నారాయణ ఇంటికి వెళ్లిన సీఐడీ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు యత్నించగా.. నారాయణ అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్యకు నోటీసులు అందజేశారు. ఈనెల 22న విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. చంద్రబాబు కంటే ఒకరోజు ముందు నారాయణను విచారణకు పిలవడం చర్చనీయాంశమైంది. చంద్రబాబుపై పెట్టిన కేసులనే నారాయణపైనా నమోదు చేసిన అధికారులు 41 సీఆర్పీసీ కింద ఆయనకు నోటీసులిచ్చారు. విచారణలో భాగంగా అసైన్డ్ భూములకు సంబంధించిన జీవో 41 ఎలా జారీ చేశారు. ఇందులో ఎవరి ప్రయోజనాలైనా ఆశించారా అనే అంశంపై ప్రశ్నించే అవకాశముంది. వీరిద్దరికంటే ముందే ఎమ్మెల్యేను సైతం విచారణకు రమ్మని సీఐడీ అధికారులు కోరడం ఇప్పుడు సంచలనంగా మారింది.