ఎవరెన్ని చెప్పినా, చంద్రబాబు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైఎస్ జగన్ మూడు రాజధానుల విషయంలో అస్సలు వెనక్కి తగ్గడంలేదు. కోర్టు విధించిన స్టేటస్ కో తొలగాక ఎట్టి పరిస్థితుల్లోనూ పాలనాపరమైన శాఖలను విశాఖకు తరలించడానికి సిద్దంగా ఉన్నారు సీఎం. 250 రోజుల నుండి అమరావతి రైతులు చేస్తున్న దీక్షలను సైతం ప్రభుత్వం లెక్క చేయడం లేదు. అండగా నిలుస్తుందని, జగన్ ప్రయత్నాలకు అడ్డుపడుతుందని అనుకున్న కేంద్ర ప్రభుత్వం సైతం తమ చేతుల్లో ఏమీ లేదని తేల్చి చెప్పడంతో మిగిలింది కోర్టులే. కోర్టుల ద్వారా ప్రభుత్వ నిర్ణయాన్ని కొన్ని రోజులు ఆపగలరు కానీ జగన్ మనసు మాత్రం మార్చలేరు కదా. అందుకే విపక్ష నేత చంద్రబాబు కొత్త కొత్త మార్గాలు వెతుకుతున్నారు.
తాజాగా ఆయన అమరావతి మీద ప్రజాభిప్రాయం సేకరించాలని నిర్ణయించుకున్నారు. అందుకే www.apwithamaravathi.com పేరుతో ఒక వెబ్ సైట్ స్టార్ట్ చేశారు. ఈ సైట్ ద్వారా రాష్ట్ర ప్రజలు అమరావతినే రాజధానిగా కావాలనుకుంటున్నారా లేకపోతే మూడు రాజధానులనే ఇష్టపడుతున్నారా అనేది తెలియపరచవచ్చు. రాష్ట్ర ప్రజల్లో అమరావతిని కాపాడుకోవాలని ఉన్నా దాని కోసం ప్రభుత్వాన్ని ఎదిరించి దీక్షలు, పోరాటాలు చేసే ఉద్దేశ్యమైతే లేదు. ఈ విషయం చంద్రబాబుకు ఈపాటికే అర్థమైంది. అమరావతి నినాదాన్ని ప్రజా ఉద్యమంగా మలచడం కూడ అంత సులువైన పని కాదని ఆయన గ్రహించారు. అందుకే ప్రజల అభీష్టాన్ని ఎలాగైనా బయటపడేలా చేయడానికి ఈ ఆన్ లైన్ పోలింగ్ మార్గాన్ని ఎంచుకున్నారు.
రాష్ట్ర ప్రజల్లో ఎక్కువ శాతం మంది ఓటింగ్లో పాల్గొంటే అమరావతికే అనుకూలంగా ఓట్లు పడే అవకాశం ఉంది. ఈ పరిణామం ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే చాలా మంది జనం ఓటింగ్ విషయమై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం పాఠశాల విషయమై ప్రతిపక్షాలు, మేధావుల నుండి వ్యతిరేకత వచ్చినప్పుడు జగన్ సర్కార్ అభిప్రాయ సేకరణ చేశామని, అందులో మెజారిటీ తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీష్ విద్య కావాలన్నారనే రిపోర్ట్ పట్టుకుని దాని ఆధారంగానే హైకోర్టు తీర్పు మీద సుప్రీం కోర్టుకు వెళ్ళి ఇంగ్లీష్ మాధ్యమం అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే అమరావతి విషయంలో కూడా ప్రజాభిప్రాయం తీసుకుని దానికి అనుగుణంగా వెళ్లొచ్చు కదా అంటున్నారు. ఈ దశలో చంద్రబాబు మొదలుపెట్టిన ఆన్ లైన్ అభిప్రాయ సేకరణ ద్వారా వెల్లడయ్యే ఫలితాలు ప్రభుత్వానికి షాకిచ్చే అవకాశం ఉంది.