తెరవెనుక కథ నడిపిస్తున్న చంద్రబాబు.! జనసేనలో మల్లగుల్లాలు.!

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ మీదకు రాజకీయంగా వలపు బాణాల్ని చాన్నాళ్ళ క్రితమే సంధించేశారు. ‘వన్ సైడ్ లవ్..’ అంటూ చంద్రబాబే స్వయంగా వ్యాఖ్యానించారు. జనసేన నుంచి ఈ విషయమై సరైన స్పందన రాకపోయినా, ‘మేమూ, జనసేన పార్టీ కలిసే ఎన్నికలకు వెళతాం..’ అంటూ టీడీపీ నేతలతో చంద్రబాబు చెప్పిస్తున్నారు. అలా జనసేన పార్టీని తమ గుప్పిట్లోకి లాగేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.

‘చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్..’ అంటూ వైఎస్ జగన్ చేసే విమర్శల కంటే కూడా, ‘జనసేన పార్టీ మాతోనే కలుస్తుంది..’ అంటూ టీడీపీ చేస్తున్ ప్రచారమే జనసేన పార్టీకి ఎక్కువ నష్టం కలిగిస్తుంది. ఎందుకంటే, టీడీపీ అనుకూల మీడియా కూడా జనసేనను టీడీపీతో అంటగట్టేస్తోంది మరి.

జనసేనకు టీడీపీ 25 సీట్లు ఆఫర్ చేసిందనీ, జనసేన పార్టీ మాత్రం 40 సీట్లు అడుగుతోందని టీడీపీ అనుకూల మీడియానే ప్రచారం చేస్తోంది. ఇలాంటి స్కెచ్‌లు వేయడంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు దిట్ట. జనసేనాని తాజాగా మూడు ఆప్షన్స్ ప్రకటిస్తే, వాటిపై వైసీపీ అనుకూల మీడియా కంటే, టీడీపీ అనుకూల మీడియానే ఎక్కువ యాగీ చేసింది.

‘జనసేన బలహీనమైన పార్టీ..’ అంటూ టీడీపీ నేతలతో టీడీపీ అనుకూల మీడియానే విశ్లేషణలు చేయించింది. ఇదంతా చంద్రబాబు తెరవెనుకాల వుండి ఆడించిన నాటకమేనన్నది నిర్వివాదాంశం. గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి నాయకులు, జనసేన పార్టీని చులకనగా మాట్లాడారంటే, ఆ వ్యాఖ్యల వెనుక చంద్రబాబే వుంటారు మరి.!

అయినాగానీ, ఈ మొత్తం వ్యవహారంపై చంద్రబాబు, ఆయన పుత్రరత్నం వ్యూహాత్మక మౌనం పాటించడమంటే, జనసేనాని ఈ పరిణామాలపై ఒకింత ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వుంటుంది.