చంద్రబాబు యాత్రలు సక్సెస్ అవుతున్నాయ్‌గానీ.!

Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కీలక పర్యటనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్రలో మొదలు పెట్టి, గోదావరి జిల్లాల వరకూ వచ్చింది యాత్రల వ్యవహారం. పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు, కింది స్థాయి నేతలకు దిశా నిర్దేశం, కార్యకర్తల్లో జోష్ నింపడం.. ఇలా సాగుతోంది చంద్రబాబు పర్యటనల తీరు.

2‌024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా చంద్రబాబు జనంలోకి వచ్చారన్నది తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నమాట. ఔనా.? టీడీపీకి అధికారం మళ్ళీ వచ్చే పరిస్థితి వుందా.? అంటే, ఆ తెలుగు తమ్ముళ్ళే సమాధానం చెప్పడానికి తడుముకోవాల్సిన, తటపటాయించాల్సిన పరిస్థితి. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చంద్రబాబు పర్యటనలకు దూరంగా వున్నారంటేనే, టీడీపీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఇదిలా వుంటే, తెలుగు తమ్ముళ్ళలో కొంత జోష్ అయితే పెరిగిన మాట వాస్తవం. కానీ, అది ఎన్నాళ్ళు వుంటుందన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. చంద్రబాబు పర్యటనలతో కార్యకర్తల్లో ఉత్సాహం పెరగడం, నారా లోకేష్ ఎంట్రీతో వ్యవహారం మళ్ళీ మొదటికి రావడం సహజమే అన్నది టీడీపీ సీనియర్లు కొందరు ఆఫ్ ది రికార్డుగా చెప్పే మాట.

తన పర్యటనల్లో చంద్రబాబు ఇతర పార్టీల నేతల్ని ఆకర్షించగలిగి వుంటే, ఆ స్థాయిలో కింది స్థాయి నేతలు పావులు కదిపి వుంటే.. చంద్రబాబు పర్యటనల వల్ల టీడీపీకి కాస్తో కూస్తో ప్రయోజనం వుండేది. ముందు ముందు ఆ ముచ్చట కూడా వుంటుందని టీడీపీ శ్రేణులు చెబుతున్న మాటల్లో నిజమెంతో వేచి చూడాల్సిందే.