జగన్ ఫొటోతోపాటు, మోడీ ఫొటో కావాలంటున్న కేంద్ర మంత్రి నిర్మల

సంక్షేమ పథకాలంటే.. ప్రజాధనాన్ని ప్రజలకు పంచి పెట్టడం. కానీ, అధికారంలో వున్నోళ్ళు తమ పేర్లతో ఆయా సంక్షేమ పథకాల్ని అమలు చేస్తుంటారు. ఎందుకిలా.? అన్న ప్రశ్నకు సమాధానం అందరికీ తెలిసిందే. సొమ్ములొకడివి.. సోకులు ఇంకొకడివి. ఒకర్ని తప్పు పట్టడానికి వీల్లేదిక్కడ. గతంలో జరిగిందదే.. ఇప్పుడూ జరుగుతున్నదదే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికొస్తే, ఇక్కడ రాజకీయాలు మరీ విచిత్రంగా వుంటాయి. చంద్రబాబు హయాంలో అన్నిటికీ ‘చంద్రన్న’ పేరు తగిలించేశారు. దాంతో, వైఎస్ జగన్ హయాంలో ‘జగనన్న’ పేరు తగిలిస్తున్నారు. రేప్పొద్దున్న పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే, సంక్షేమ పథకాలకు ‘పవనన్న’ అనే పేరు వుంటుందేమో. సరే, అసలు విషయంలోకి వచ్చేద్దాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్, సంక్షేమ పథకాలకు మోడీ ఫొటో వుండాలంటూ ఆస్తకిరమైన వ్యాఖ్యలు చేశారు. ‘కేంద్రం, పేదల కోసం ఉచితంగా రేషన్ అందిస్తోంది.

ఆ పథకానికి ఖచ్చితంగా మోడీ ఫొటో పెట్టాల్సిందే. మిగతా వ్యవహారాలకు జగన్ ఫొటో పెట్టకుంటే మాకు అభ్యంతరం లేదు..’ అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. అన్నట్టు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ మీద ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో పెడుతున్న విషయం విదితమే. ఇటీవల ఖేల్ రత్న పురస్కారానికి రాజీవ్ గాంధీ పేరు తీసేసి, ధ్యాన్ చంద్ పేరు పెట్టారు ప్రధాని నరేంద్ర మోడీ. అసలు పేరులో ఏముంది.? కేవలం పేర్లు మార్చేసుకుని.. తమ పేర్లను పెట్టేసుకుంటే, జనం తమను మళ్ళీ మళ్ళీ గెలిపించేస్తారని రాజకీయ నాయకులు అనుకుంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. చంద్రబాబు ఎన్ని సంక్షేమ పథకాలకు తన పేర్లు పెట్టకున్నా, ఐదేళ్ళకే సాగనంపేశారు 13 జిల్లాల ప్రజలు. వైఎస్ జగన్ అయినా, మోడీ అయినా.. పేర్లతో సాధించేదేమీ వుండదు.. ఐదేళ్ళ హంగామా.. వర్కవుట్ అయితే, అదనంగా మరో ఐదేళ్ళ హంగామా అంతే.