కరోనా మహమ్మారితో అందరూ రోడ్డున పడ్డారు. లక్షాధికారి కూడా భిక్షాధికారి అయ్యాడు. తమ ఉద్యోగాన్ని కోల్పోయిన వారి పరిస్థితి అయితే దారుణం. అందరూ కరోనాతో అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు. చేతిలో చిల్లిగవ్వ లేక సతమతమయ్యారు.
పోనీ ఏదైనా పని చేసుకుందామంటే ఉపాధి లేదు. తిండికి కూడా లేక చాలామంది మధ్యతరగతి, పేద కుటంబాలు నరకం అనుభవిస్తున్నాయి.
అయితే.. కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులను ఆదుకోవడానికి కేంద్రం ముందుకొచ్చింది. వాళ్ల సగటు వేతనంలో 50 శాతాన్ని మూడు నెలల పాటు చెల్లించాలని నిర్ణయించింది.
దీనిపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ ఈఎస్ఐ ప్రతినిధులతో సమావేశమయ్యారు. కరోనా సమయంలో విధించిన లాక్ డౌన్ వల్ల ఉద్యోగం కోల్పోయిన వారు అప్పటికే ఈఎస్ఐ లో మెంబర్ గా ఉన్నవాళ్లు ఈ ఆర్థిక సాయం పొందడానికి అర్హులు.
దేశం మొత్తం 41 లక్షల మంది కార్మికులు ఈ ఆర్థిక సాయాన్ని పొందడానికి అర్హులుగా ఉన్నట్టు కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. లాక్ డౌన్ విధించిన తర్వాత మార్చి 24 నుంచి ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు ఎవరైతే తమ ఉద్యోగాలను కోల్పోతారో వాళ్లకు ఈ పథకం వర్తిస్తుంది. దానితో పాటు మార్చి 31, 2020 కంటే ముందు ఈఎస్ఐలో చేరినవాళ్లు అయి ఉండాలి.