మళ్ళీ సినీ నటుడు శివాజీని రంగంలోకి దించిన చంద్రబాబు

సినీ నటుడు శివాజీ మళ్ళీ రంగంలోకి దిగాడు. అమరావతి పరిరక్షణ సమితికి మద్దతుగా నినదించాడు. రాష్ట్రం పట్ల అమితమైన ప్రేమ తనకుందంటూ, రాష్ట్ర ప్రజలందరిపైనా దూషణలకు దిగాడు. ఎవరూ రాష్ట్రం పట్ల బాధ్యతగా వ్యవహరించడంలేదన్నాడు. ‘నేను ఏ పార్టీకీ చెందినవాడ్ని కాను..’ అంటూనే, చంద్రబాబు తరఫున మాట్లాడేశాడు శివాజీ.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ప్రత్యేక హోదా కోసమనీ, అమరావతి కోసమనీ.. సినీ నటుడు శివాజీ చేసిన యాగీ అందరికీ గుర్తుండే వుంటుంది. ఆ తర్వాత కొన్నాళ్ళు శివాజీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఓ న్యూస్ ఛానల్ వ్యవహారంలో తలదూర్చి, కేసులు ఎదుర్కొని.. విదేశాలకు వెళ్ళడానికీ ఇబ్బంది పడ్డాడు శివాజీ.

సరే, శివాజీ మాట స్పష్టంగా వుంటుంది. మంచి వాగ్ధాటి వున్నోడేమో.. చెప్పాలనుకున్నది సూటిగానే చెప్పేస్తాడు. కానీ, రాష్ట్ర ప్రజల పట్ల బాధ్యత వున్నోడైతే.. ఏదో ఒక పార్టీ తరఫున ప్రజా క్షేత్రంలో నిలబడొచ్చు. పోనీ, రాజకీయ పార్టీలేవీ నచ్చకపోతే.. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కూడా ప్రజల తరఫున నిలబడొచ్చు.

ఇవేవీ చేయడుగానీ, ప్రజలపై తిట్ల వర్షం కురిపించడానికి సిద్ధమవుతాడు. ప్రజల్ని అమాయకులుగా ఏ రాజకీయ నాయకుడు భావించినా అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. రాజకీయ పార్టీలు కోట్లు ఖర్చు చేసేస్తే గెలిచేయవు. గెలవడానికి డబ్బు కూడా ఓ కారణమవుతుందేమో.. అంతే తప్ప, అందరూ డబ్బుకి పడిపోతారనుకోవడం పొరపాటు.

ఓ పార్టీకి అవకాశమిచ్చి, ఆ పార్టీ హయాంలో అభివృద్ధి జరిగిందో లేదో బేరీజు వేసుకుని, సమయం సందర్భం చూసి వాతలు పెట్టడం ప్రజలకు బాగా తెలుసు. అంతటి దూరాలోచన వున్న ప్రజల్ని ఉద్దేశించి ‘వెధవలు’ అనడం ఎంతవరకు సబబు.? అన్నది శివాజీ ఆలోచించుకోవాలి. ‘అందర్నీ కాదు, కొందర్నే అన్నాను..’ అని శివాజీ బుకాయించొచ్చుగాక.. ఆ కొందర్ని అనే నైతిక హక్కు కూడా లేదాయనకి.