సాధారణంగా ఏ విచారణ సంస్థ అయినా, నిందితులకు బెయిల్ ఇవ్వొద్దనే డిమాండ్ చేస్తుంటుంది న్యాయ స్థానంలో. కానీ, చిత్రంగా సీబీఐ.. కోర్టు విజ్ఞతకు వదిలేస్తోంది.. అది వైఎస్ జగన్ బెయిల్ రద్దు వ్యవహారంలో అయినా, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు వ్యవహారంలో అయినా. ఈ విషయమై రాజకీయ వర్గాల్లో చిత్ర విచిత్రమైన వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి, వైఎస్ జగన్.. 16 నెలల పాటు జైల్లో వుండడమే అప్పట్లో ఓ సంచలనం. నేర నిరూపణ జరగకుండా ఓ వ్యక్తి అన్ని రోజులు నిందితుడిగా జైల్లో వుండి విచారణ ఎదుర్కోవడంపై చాలా విమర్శలొచ్చాయి. అది రాజకీయ కక్ష సాధింపు.. అనే అభిప్రాయం చాలామందిలో వ్యక్తమయ్యింది. ఏళ్ళు గడుస్తున్నా, ఈ కేసుల విచారణలో పురోగతి కనిపించడంలేదు. విచారణ, వాయిదా.. విచారణ వాయిదా.. ఇదే కథ నడుస్తూ వస్తుండడంతో ఎవరికి తోచిన విశ్లేషణ వారు చేస్తూనే వున్నారు.
ఈ క్రమంలో సీబీఐ, అనవసర వివాదాలు కొనితెచ్చుకోకుండా కోర్టు విజ్ఞతకు వదిలేస్తున్నట్లు జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లపై కోర్టుకు నివేదించిందా.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే. అయితే, కేంద్రం వద్ద వైసీపీ సాగిలాపడ్డంతోనే, సీబీఐ ఈ కేసుల్లో చలనం లేనట్టుగా వ్యవహరిస్తోందన్నది ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఆరోపణ. అయితే, ఇన్నేళ్ళలో వైఎస్ జగన్ అయినా, విజయసాయిరెడ్డి అయినా ఏ సాక్షినీ బెదిరించారనే ఆరోపణలు ఎక్కడా రాలేదు. తన విషయంలో పార్టీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందన్న అక్కసుతో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు.. పార్టీ అధినేత వైఎస్ జగన్ అలాగే, పార్టీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు కోసం కోర్టును ఆశ్రయించారు. దాంతో, ఈ కేసుల పట్ల సహజంగానే, సీరియస్‌నెస్ అనేది జనానికీ కనిపించడంలేదు.