అయ్యన్నని సమర్థించగలమా? ఆయనపై దాడిని సమర్థించగలమా.?

Ayyanna Patrudu

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిని రాజకీయంగా ఎవరైనా సమర్థించగలరా.? ఛాన్సే లేదు. ఎందుకంటే, ఆయన వాడుతున్న భాష అలాంటిది. అత్యంత జుగుప్సాకరమైన భాష వినియోగిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీదా, వైసీపీ నేతల మీదా.!

మరి, వైసీపీ నేతలు చేస్తున్నదేంటి.? అంతకన్నా దారుణమైన భాషని మంత్రులే వాడుతున్నారు. సో, ‘కుక్క కాటుకి చెప్పుదెబ్బ’ అన్నట్టు, అయ్యన్న బాగానే సమాధానమిస్తున్నారని అనగలమా.? అనడానికి వీల్లేదు. అటు వైసీపీని సమర్థించలేం, ఇటు టీడీపీని సైతం సమర్థించలేం.

రాను రాను, బూతుల పర్వం కాస్తా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారిక భాషలా మారిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కీలక పదవుల్లో వున్న వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా భాషా భ్రష్టత్వం ప్రదర్శిస్తున్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడాల్లేవిక్కడ.

ఇక, అయ్యన్నపాత్రుడి ఇంటిపై ‘ప్రభుత్వ’ దాడి విషయానికొస్తే, ఇదీ సమర్థనీయం కాదు. గతంలో మంత్రిగా పని చేశారాయన. ఒకవేళ అయ్యన్నపాత్రుడు కబ్జాకి పాల్పడి వుంటే, దానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ, దానికీ ఓ పద్ధతి వుంటుంది. ఆ పద్ధతి పాటించకుండా, జేసీబీలతో అధికారులు దాడికి దిగితే ఎలా.?
చివరికి కోర్టులో అధికారులకే చీవాట్లు పడే పరిస్థితి వచ్చిందంటే, ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఎంత కక్ష పూరితంగా వ్యవహరించిందో అర్థమవుతోంది.