Janasena : జనసేనను దెబ్బకొడ్తున్న టీడీపీ, పవన్ కళ్యాణ్‌కి అర్థమవుతోందా.?

Janasena : జనసేన పార్టీకి రాజకీయంగా సమస్యలొచ్చేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కాదు, తెలుగుదేశం పార్టీతోనే. చంద్రబాబు ఎవరితో జతకడితే, వాళ్ళు రాజకీయంగా నాశనమైపోవడమేనన్న అభిప్రాయం రాజకీయాల్లో బలంగా వుంది. జాతీయ స్థాయిలో బలంగానే వున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నాశనమవడానికి కారణం టీడీపీనే.

ఇక, 2019 ఎన్నికల్లో జనసేనను వ్యూహాత్మకంగా దెబ్బకొట్టింది టీడీపీ. ‘జనసేన మా మిత్రపక్షమే..’ అని ప్రచారం చేయడంలో టీడీపీ విజయం సాధించింది.. ఆ కారణంగానే, టీడీపీకి చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు వచ్చాయి, సీట్లు రాకపోయినాగానీ.

టీడీపీని దారుణంగా దెబ్బకొట్టింది తామేనని పదే పదే చెప్పుకునే జనసేన పార్టీ, స్థానిక ఎన్నికల సమయంలో అదే టీడీపీతో లోపాయకారీ ఒప్పందాలు కుదుర్చుకుని, మరింతగా ఓటర్లలో పలచనైపోయింది. బీజేపీతో అధికారిక పొత్తు, టీడీపీతో అనధికారిక స్నేహం.. ఈ రెండూ జనసేనకు నష్టం కలిగిస్తున్నాయి.

వాస్తవానికి, జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెరుగైన ఓటు బ్యాంకే వుండేది.. ఒకవేళ ఆ పార్టీ ఒంటరిగా నిలబడి వుంటే. ఇకనైనా బీజేపీతో అధికారిక పొత్తు, టీడీపీతో అనధికారిక స్నేహాన్ని జనసేన వదులుకోకపోతే.. జనసేన పార్టీ 2024 ఎన్నికల నాటికి పూర్తిగా కనుమరుగైపోయే ప్రమాదం లేకపోలేదు.

కానీ, ఈ పరిస్థితుల్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారు జనసేన అధినేత. వైసీపీతో కలవకపోయినా, టీడీపీని రాజకీయంగా దెబ్బకొట్టే క్రమంలో అధికార వైసీపీ విషయంలో కాస్త విమర్శనాత్మక ధోరణి తగ్గించుకుంటే.. అది జనసేన పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది.

ఎన్నికల నాటికి సొంతంగా బలపడేందుకూ ఈ వ్యూహం ఫలిస్తుంది. కానీ, అసందర్భ ప్రేలాపన తరహాలో అయినదానికీ, కానిదానికీ చంద్రబాబు బాటలో పవన్ రాజకీయం చేస్తూ వెళితే.. జనసేన పార్టీ మరింతగా దిగజారిపోవడం ఖాయం.