Varun Sandesh: బిగ్‌బాస్‌ అంటా స్క్రిప్టా ? : క్లారిటీ ఇచ్చిన వరుణ్ సందేశ్

Varun Sandesh: బిగ్‌బాస్‌లోకి వెళ్లి వచ్చిన తర్వాత తిరిగి చూసుకుంటే జర్నీ ఆఫ్ లైఫ్‌ టైమ్‌ లాగా అనిపిస్తుందని ప్రముఖ హీరో వరుణ్ సందేశ్ అన్నారు. చాలా మంది బిగ్ బాస్ షో అంతా స్ర్కిప్టెడా ? వీళ్లు ఇలా చేస్తున్నారు. అలా చేస్తున్నారు.. లేదంటే అంతా యాక్టింగా ? అనుకుంటారు అని ఆయన చెప్పారు. తాను కూడా బిగ్‌బాస్ షోకు వెళ్లకముందు వితికతో కలిసి ఇంట్లో కొన్ని ఎపిసోడ్స్ చూసినపుడు తాను కూడా అలానే ఫీల్ అయ్యేవాడినని ఆయన చెప్పుకొచ్చారు. కానీ అదంతా స్క్రిప్ట్ కాదని, అదంతా నిజమేనని ఆయన క్లారిటీ ఇచ్చారు.

కానీ తాను అక్కడికి వెళ్లాక, 105 రోజులు ఆ ఇంట్లో ఉన్నాక అనిపించింది.. ఆ హౌస్‌కి ఎవరెళ్లినా కూడా వారికి గౌరవం ఇవ్వాలి అని వరుణ్ సందేశ్ అన్నారు. ఎందుకంటే ప్రస్తుత జనరేషన్‌లో ఒకరోజు ఫోన్ లేకుండా ఉండడం అనేదే చాలా కష్టం. టీవీ గానీ, ఎలక్ర్టానిక్‌కి సంబంధించినవి ఏవీ ఉండవు. అలాంటిది అంతా ఐసోలేటెడ్ ప్రపంచంలా ఉండడమనేది మామూలు విషయం కాదని ఆయన చెప్పారు.

ఇకపోతే బిగ్‌బాస్‌లోకి రాకముందు ఇవన్నీ ఇక వర్కవుట్ అయ్యేట్లు లేవని భావించి 2 ఏళ్లు అమెరికాకి వెళ్లిపోయానని ఆయన అన్నారు. ఏదైనా బిజినెస్ లేదా ఇంకేమైనా చేయొచ్చనే ఉద్దేశంతో, ఇక్కడ ఏం చేయాలనుకున్నా అనుకున్నవి కావట్లేదని అలా వెళ్లానని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత మళ్లీ ఇక్కడికి వచ్చేశానన్న వరుణ్, కొన్ని కథలు కూడా విన్నానని, కానీ అవేవీ తనకు నచ్చలేదని ఆయన చెప్పారు. ఆ సమయంలోనే తనకు బిగ్‌బాస్‌లోకి వెళ్లేందుకు అవకాశం వచ్చిందని ఆయన అన్నారు. మొదట్లో వెళ్లాలా, వద్దా అని సందేహించాను.. కానీ వితిక, నేను వెళ్లాలి అనేసరికి వెళ్తే బాగుంటుందేమో, కొంచెం కొత్తగా అనిపిస్తుంది కదా అని ఫైనల్ గా ఓకే చెప్పినట్టు వరుణ్ సందేశ్ వివరించారు.