బిగ్‌బాస్ తెలుగు సీజన్–9 ముగింపుతో ప్రేక్షకుల ఎదురుచూపులకు తెరపడింది. నెలల తరబడి సాగిన ఉత్కంఠభరిత పోరాటానికి చివరికి ఫుల్ స్టాప్ పడింది. ఈ సీజన్ విన్నర్‌గా కామనర్ కళ్యాణ్ పడాల నిలవడం బిగ్‌బాస్ చరిత్రలోనే ఓ ప్రత్యేక ఘట్టంగా మారింది. చివరి వరకూ నెక్ అండ్ నెక్‌గా సాగిన తనూజ–కళ్యాణ్ మధ్య పోటీలో స్వల్ప తేడాతో కళ్యాణ్ ట్రోఫీ అందుకున్నట్లు సమాచారం. దీంతో బిగ్‌బాస్ హౌస్‌లోనే కాదు.. బయట కూడా “జై జవాన్” అనే నినాదం మారుమోగిపోయింది.
నిజానికి సీజన్ ప్రారంభంలో కళ్యాణ్ పేరు విన్నర్ లిస్టులో ఎక్కడా కనిపించలేదు. మొదటి మూడు వారాలు అతని ఆటపై ఆడియన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అగ్నిపరీక్షలో చూపిన కాన్ఫిడెన్స్, హౌస్‌లోకి వచ్చాక కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. “ఇతనేనా కామనర్ కోట నుంచి వచ్చిన కంటెస్టెంట్?” అనే ప్రశ్నలు కూడా వినిపించాయి. అయితే మూడో వారం గడిచాక కథ పూర్తిగా మారింది. ప్రియ ఎలిమినేషన్ తర్వాత కళ్యాణ్ ఆటలో స్పష్టమైన మార్పు కనిపించింది. మాటల్లో స్ట్రాటజీ, టాస్కుల్లో ఫోకస్, రిలేషన్‌షిప్స్‌లో క్లారిటీ – ఒక్కో వారం అతని గ్రాఫ్ ఎక్కుతూ వెళ్లింది. ఎవరూ ఊహించని విధంగా ఫ్యామిలీ వీక్ నాటికి కళ్యాణ్ నేరుగా విన్నర్ రేసులోకి దూసుకొచ్చాడు.
అదే ఊపుతో చివరి కెప్టెన్‌గా నిలిచి, ఫస్ట్ ఫైనలిస్ట్‌గా అర్హత సాధించి హౌస్ మొత్తాన్ని షాక్‌కు గురి చేశాడు. ఇక గ్రాండ్ ఫినాలేలో తనూజతో జరిగిన హోరాహోరీ పోరులో చివరకు ప్రేక్షకుల మద్దతు కళ్యాణ్ వైపే మొగ్గింది. సీఆర్పీఎఫ్ జవాన్‌గా దేశానికి సేవ చేసిన ఈ కామనర్… ఇప్పుడు బిగ్‌బాస్ ట్రోఫీతో మరో పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. సినిమాలపై చిన్ననాటి కలలు, కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎంచుకున్న జవాన్ జీవితం, అక్కడి నుంచి అగ్నిపరీక్ష షో, ఆపై బిగ్‌బాస్ హౌస్ – కళ్యాణ్ ప్రయాణం ఇప్పుడు లక్షల మందికి ఇన్‌స్పిరేషన్‌గా మారింది. అయితే ఈ ఫలితంతో తనూజ ఫ్యాన్స్ మాత్రం కొంత నిరాశలో ఉన్నారు. అయినప్పటికీ బిగ్‌బాస్ 9 సీజన్‌ను మాత్రం “కామనర్ పవర్”ని చాటిచెప్పిన సీజన్‌గా ప్రేక్షకులు గుర్తు పెట్టుకునేలా చేసింది.
