ఇన్నాళ్లు జగన్ తన సంక్షేమ పథకాల అమలుతో అందరినీ తనవైపుకు తిప్పుకున్నారు. తెలంగాణ ప్రజలైట్ జగన్ తెస్తున్న సంక్షేమ పథకాలను చూసి మన రాష్ట్రంలో కూడ ఇవి అమలుచేస్తే బాగుంటుందని భావించారు. అమ్మఒడి, జగనన్నా చేయూత లాంటివి మేలు చేస్తాయని అనుకున్నారు. ప్రతిపక్ష పార్టీలైతే జగన్ వైపు చూపించి కేసీఆర్ మీద విమర్శలు గుప్పించారు. దీంతో జగన్ ఎప్పుడు ఏ కొత్త పథకాన్ని తీసుకొచ్చినా కేసీఆర్ కు కంగారు మొదలైనట్టే. అలాంటిది ఈసారి రివర్స్ జరిగింది. ఇన్నాళ్లు జగన్ తన పనులతో కేసీఆర్ కు టెంక్షన్ తెప్పిస్తే ఈసారి కేసీఆర్ తన పనితో జగన్ కు తలనొప్పి తెచ్చారు. అది కూడ పెద్దదే. కేసీఆర్ తాజాగా అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషణలను అమలుచేయాలని డిసైడ్ అయ్యారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోన ఓసీ వర్గ పేదల్లో హర్షం నిండింది.
అదే సమయంలో ఏపీలోని అగ్రవర్ణ పేదల్లో అసంతృప్తి మొదలైంది. ఇప్పటికే జగన్ ప్రభుత్వం మీద ఒక అభిప్రాయం ఉంది. అదేమిటంటే సంక్షేమ పథకాల ఆపేరుతో ఉన్నదంతా ఒక వర్గం ప్రజలకే ఊడ్చి పెడుతున్నారని, వాటి మూలంగా అయ్యే అప్పుల భారాన్ని భవిష్యత్తులో తాము కూడ మోయాల్సి ఉంటుందని, అగ్రవర్ణాల్లో పేదలకు ఎలాంటి సహాయ సహకారాలు అందట్లేదని, సంక్షేమ ఫలాలకు వారు దూరంగానే ఉన్నారని అంటున్నారు. అది నిజం కూడ. జగన్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అగ్రవర్ణ పేదలకు అంతగా అందే పరిస్థితి లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీల వరకే ఆగిపోయాయి. అందుకే అగ్రవర్ణ పేదలకు కూడ రిజర్వేషన్ కావాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఈ డిమాండ్ ఉంది. గతంలో కేంద్రం వారికోసం 10 శాతం రిజర్వేషన్ అమలుచేస్తామని ప్రకటించింది. అయితే ఆ అమలు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది.
కొన్ని రాష్ట్రాలు 10 శాతం రిజర్వేషన్ పెంపుకు అంగీకరించగా కొన్ని ఒప్పుకోలేదు. వాటిలో రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. అయితే తాజాగా కేసీఆర్ అమలుచేస్తామని ప్రకటించేశారు. దీంతో ఎస్సీలకు 15, ఎస్టీలకు 6, బీసీలకు 29 ఇలా మొత్తం 50 శాతంగా ఉన్న రిజర్వేషన్లు ఇకపై 60 శాతానికి చేరుకొంటాయి. విద్య, ఉద్యోగ రంగాల్లో ఈ కొత్త నిర్ణయం పెద్ద మార్పునే తీసుకురానుంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఈ 10 శాతం రిజర్వేషన్ అంశాన్ని రాజకీయం చేయాలని అనుకుంది. 10 శాతంలో 5 శాతం కాపులకు కేటాయించామని అంది. కానీ జగన్ వచ్చాక దాన్ని రద్దుచేసేశారు. మరిప్పుడు పూర్తిస్థాయిలో 10 శాతం అమలుచేయాలని, పక్క రాష్ట్రం తెలంగాణ చేస్తోంది కూడా అంటున్నారు ఏపీ ప్రజలు. మరి ఈ కొత్త చిక్కును జగన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.