ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా.. అదే చర్చ. సీఎం జగన్.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై చేస్తున్న ఆరోపణల గురించే చర్చలు. న్యాయ వ్యవస్థపైనే ప్రస్తుతం పెద్ద సందిగ్దత నెలకొనడంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి.
న్యాయవ్యవస్థపై ఏపీ సీఎం వైఎస్ జగన్.. కత్తిగట్టినట్టు వ్యవహరిస్తున్నారని… ఇది ముమ్మాటికి తప్పేనని న్యాయవాద సంఘాలు, మాజీ న్యాయమూర్తులు ఖండిస్తున్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను సీఎం జగన్ బయటికి విడుదల చేయడం ఏమాత్రం సరికాదని.. ఇది న్యాయవ్యవస్థను అవమానపరిచినట్టేనని తప్పుపడుతున్నారు.
న్యాయవ్యవస్థకు రాజ్యాంగం రక్షణ కల్పించిందని… ఒక స్వతంత్రతను కల్పించిందని.. దాన్ని జగన్ తూట్లు పొడిచారని న్యాయవాద సంఘాలు మండి పడుతున్నాయి.
ఇది శాసన వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు మధ్య యుద్ధంలా తయారవుతోంది. దీని వల్ల పాలనా వ్యవస్థ మొత్తం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సుప్రీంకోర్టు జడ్జిపై ముఖ్యమంత్రి ఆరోపణలు చేయడం తగదని.. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పలువురు న్యాయ సంఘాల నేతలు లేఖలు రాస్తున్నారు. ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ తో పాటు పలు సంఘాలు సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖలు పంపించాయి.