ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చీఫ్‌గా బండి సంజయ్ నియమించబడ్డారా.?

రాజకీయాల్లో సెటైర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయ్. తాజాగా, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందంటూ జోస్యం చెప్పిన విషయం విదితమే.

‘కేసీయార్‌ని కూడా ఈడీ పిలుస్తుంది..’ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈడీ విచారణకు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరైన నేపథ్యంలో, ‘కేసీయార్ కూడా ఈడీ విచారణ ఎదుర్కోవాల్సిందే..’ అని సెలవిచ్చారు బండి సంజయ్.

బోడి గుండుకీ, మోకాలికీ ముడి పెట్టడం అంటే ఇదే మరి.! ఈడీ ఎవర్ని విచారణకు పిలుస్తుందో నిర్ణయించడానికి బండి సంజయ్ ఎవరు.? సాక్షాత్తూ దేశ ప్రధాని అయినా, ఈడీ ఫలానా రాజకీయ నాయకుడి మీద విచారణ జరుపుతుందని చెప్పకూడదు. అలా చెబితే, అసలు ఈడీ అనే దర్యాప్తు సంస్థకు విలువ లేనట్టే.!

కానీ, రాజకీయాల్లో అన్నీ వుంటాయ్. ‘అరెస్టు చేస్తాం.. జైలుకు పంపిస్తాం..’ అని టీఆర్ఎస్ నేతలూ తరచూ చెబుతుంటారు. ఇక, బండి సంజయ్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్, ట్విట్టర్ వేదికగా సెటైరేశారు.

‘ప్రధాని నరేంద్ర మోడీగారూ.. బండి సంజయ్‌ని ఈడీ చీఫ్‌గా నియమించినందుకు ధన్యవాదాలు..’ అంటూ వెటకారం చేవారు ఆ ట్వీటులో కేటీయార్. ‘డబుల్ ఇంజిన్ అంటే మోడీ, ఈడీ అని మేం అర్థం చేసుకున్నాం..’ అని కూడా కేటీయార్ పేర్కొన్నారు. ఈ ట్వీటు ఇప్పుడు వైరల్ అయి కూర్చుంది. అవదా మరి.. ఆ స్థాయిలో సెటైర్ వేస్తే.!