ఆత్మకూరు ఉప ఎన్నిక: చేతులెత్తేసిన తెలుగుదేశం పార్టీ.!

Atmakur By Poll

‘సిట్టింగ్ ప్రజా ప్రతినిథి మరణిస్తే, తద్వారా సంభవించే ఉప ఎన్నికల్లో ఆ ప్రజా ప్రతినిథి కుటుంబ సభ్యులే పోటీ చేసినప్పుడు, వారిపై పోటీకి మా అభ్యర్థిని నిలబెట్టకూడదనేది మా పార్టీ సిద్ధాంతం..’ అంటూ ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక విషయమై చేతులెత్తేశారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు.

సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి, వైఎస్ జగన్ క్యాబినెట్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశారు. అయితే, ఆయన గుండె పోటుతో హఠాన్మరణం చెందారు. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేయయబోతున్నారు.

రాజకీయాలంటేనే, అర్థం పర్థం లేని వ్యవహారం. నీతి, నిబద్ధత అస్సలు కనిపించదు రాజకీయాల్లో. అలాంటిది, నైతికత అనీ, ఇంకోటనీ చెప్పి ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోవడమేంటి.? తిరుపతి లోక్ సభ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేసింది. అప్పుడు సిట్టింగ్ ఎంపీ కుటుంబ సభ్యులకు వైసీపీ టిక్కెట్ ఇవ్వలేదనే సాకు చూపించి తెలుగుదేశం పార్టీ. కడప జిల్లా బద్వేలులో మాత్రం టీడీపీ పోటీ చేయలేదు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సతీమణి ఎన్నికల బరిలోకి దిగారు.

నిజానికి, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ.. తిరిగి పుంజుకునేందుకు బద్వేలు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికలు అత్యంత కీలకమే. కానీ, మిగిలిన ఆ కాస్త పరువూ పోగొట్టుకోవడమెందుకని టీడీపీ రెండు చోట్లా చేతులెత్తేసినట్టుంది.

వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడ్.. అని చెప్పుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో అభ్యర్థిని నిలబెట్టే సాహసం కూడా చేయకపోవడాన్ని ఏమనుకోవాలి.?