Health Tips: ఆరోగ్యానికి మంచిదని రాగి పాత్రలు ఎక్కువగా వినియోగిస్తున్నారా? అయితే ఈ విషయాల గురించి తెలుసుకోండి..!

Health Tips: ఈ రోజుల్లో ఆహార పదార్థాలు వండటానికి ఎక్కువగా వివిధ రకాల పాత్రలను వినియోగిస్తున్నారు. అయితే వీటిలో కొన్ని రకాల పాత్రలను ఉపయోగించి వంట చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కానీ పురాతన కాలంలో మన పూర్వీకులు వంటలు తయారు చేయడానికి మట్టి పాత్రలు, రాగి పాత్రలను వినియోగించేవారు. మట్టి పాత్రలు, రాగి పాత్రలు ఉపయోగించటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి వీటి వాడకం ఎక్కువైపోయింది. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని రాగి పాత్రలను వినియోగించేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయటం వల్ల దుష్పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. రాగి పాత్రలను ఉపయోగించేటప్పుడు చేయకూడని కొన్ని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రాగి పాత్రలో నీరు తాగటం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అలా అని చాలామంది రాగిపాత్రలో మజ్జిగ కలుపుకొని తాగుతూ ఉంటారు. ఇలా రాగి పాత్రలో పెరుగు లేదా మజ్జిగ ఉంచి వాటిని తీసుకోవడం వల్ల ఆ పదార్థాలు విషపూరితంగా మారి వాంతులు , వికారం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

అలాగే పొరపాటున కూడా నిమ్మ రసాన్ని రాగిపాత్రలో ఉంచకూడదు. నిమ్మరసాన్ని రాగి పాత్రలో ఉంచటం వల్ల నిమ్మకాయలో ఉండే యాసిడ్ విషమంగా మారుతుంది. అందువల్ల నిమ్మరసాన్ని రాగిపాత్రలో ఉంచకూడదు.అలాగే ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా రాగి పాత్రలో ఉంచి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

ఊరగాయలను నిల్వ ఉంచడానికి చాలామంది రాగి పాత్రలను ఉపయోగిస్తారు. కానీ రాగి పాత్రలో ఊరగాయలు నిల్వ చేయడం వల్ల అందులో ఉండే ఉప్పు, పులుపు, వెనిగర్ కారణంగా ఊరగాయ విషపూరితంగా మారుతుంది. రాగి పాత్రలో నిల్వ ఉంచిన ఊరగాయలు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.కాబట్టి రాగిపాత్రలు వినియోగించే వారు ఈ పొరపాట్లు చేయటం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.