ఏంటో అసలు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా? జరగవా? అనే మీమాంశలో ఏపీ ప్రజలు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహిస్తాం.. అని ఈసీ పట్టుబడుతుంటే.. ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. వచ్చే ఏప్రిల్ లేదా మేలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం అంటూ ప్రభుత్వం హింట్ కూడా ఇస్తోంది. అయితే ఇక్కడ అందరూ ఆలోచించాల్సిన విషయం ఒకటుంది.
అసలు.. పంచాయతీ ఎన్నికలు అంటేనే సీఎం జగన్ భయపడిపోతున్నారు.. అనే వార్తలు ప్రస్తుతం గుప్పుమంటున్నాయి. ఎందుకంటే.. పంచాయతీ ఎన్నికలు అంటేనే చాలు.. ప్రభుత్వం తెగ హడావుడి చేస్తోంది. ఎన్నికలు వాయిదా వేయడానికే మొగ్గు చూపుతోంది.
ఇప్పట్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే.. వైసీపీ ఓడిపోతుందని జగన్ ముందే పసిగట్టారా? అందుకే.. తన నిర్ణయాన్ని సీఎస్ తో చెప్పిస్తున్నారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
జగన్ కు ఓటమి భయం పట్టుకుంది.. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించకుండా.. ఈసీతో వివాదాన్ని లేపి.. వాటిని వాయిదా వేయిస్తూ వస్తున్నారు.. అంటూ టీడీపీ ఆరోపిస్తోంది.
అయినా.. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు. ఆయనకు, ఎన్నికలకు ఏంటి సంబంధం.. ఎన్నికల కమిషన్ పని అది చూసుకుంటుంది. దాన్ని నియంత్రించే అధికారం ముఖ్యమంత్రికి ఎవరిచ్చారు.. అంటూ చంద్రబాబు మండిపడ్డారు.
మొత్తానికి సీఎం జగన్.. ఎందుకో ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వెనుకంజ వేస్తున్నారు. అది ప్రతిపక్షాలకు మంచి పాయింట్ అవుతోంది. అధికార పార్టీని విమర్శించడానికి ఒక ఆయుధం అవుతోంది.