ఏపీ: వాలంటీర్లకు భారీ షాక్ .. మొత్తం వెనక్కి ఇచ్చేయండి?

ap highcourt extends status quo on ap 3 capitals bill

ఏపీ వాలంటీర్లకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. మున్సిపల్‌ ఎన్నికలు ముగిసేవరకు వార్డు వాలంటీర్లు తమ ఫోన్లను అధికారులకు అప్పగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికలకు దూరంగా ఉంచాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ఎస్‌ఈసీ ఇచ్చిన ఉత్తర్వులపై సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు వాలంటీర్లు తమ ఫోన్లను మున్సిపల్‌ కమిషనర్లు నియమించిన అధికారులకు అప్పగించాలని, సాధారణ విధుల్లో భాగంగా ఫోన్లు అవసరమైతే.. సంబంధిత అధికారి పర్యవేక్షణలో వారు వాటిని ఉపయోగించుకోవచ్చని తెలిపింది.

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వాలంటీర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఎస్‌ఈసీకి కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌ఈసీ అంగీకారం మేరకు ఈ ఆదేశాలిచ్చింది. వాలంటీర్ల మొబైల్స్‌కు సంబంధించి సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ఎస్ఈసీ అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు న్యాయమూర్తులుజస్టిస్‌ జోయ్‌మల్య బాగ్చీ, జస్టిస్‌ యూ.దుర్గాప్రసాదరావుతో కూడిన ధర్మాసనం పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపింది. పంచాయతీ ఎన్నికల సమయంలో వాలంటీర్ల తీరుపై భారీగా ఫిర్యాదులు వచ్చాయని ఎస్‌ఈసీ తరఫున సీనియర్‌ లాయర్ ఆదినారాయణరావు వాదనలు వినిపించారు.

ఎస్ఈసీ వాదనలపై స్పందించిన ధర్మాసనం.. ప్రభుత్వం ఏజీ, ఎస్ఈసీ లాయర్ పరస్పర అంగీకారం మేరకు ఏ అధికారి వద్ద ఫోన్లను ఉంచితే ఉత్తమమో తెలపాలని కోరింది. ఇరువైపుల న్యాయవాదుల అభిప్రాయం తర్వాత.. మున్సిపల్‌ కమిషనర్లు నామినేట్‌ చేసిన అధికారుల వద్ద ఫోన్లను ఉంచాలని ధర్మాసనం నిర్ణయించింది. వాలంటీర్లు ఫోన్లను వినియోగించకుండా పూర్తిగా నిలువరించడం సరికాదని అభిప్రాయపడింది. వాలంటీర్లు అధికార పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తూ.. అధికారిక ఫోన్లలోని డేటాను దుర్వినియోగం చేస్తున్నారని ఎస్ఈసీకి ఫిర్యాదులు వచ్చాయి. మున్సిపల్ ఎన్నికలకు వాలంటీర్లను దూరంగా పెట్టాలని, మొబైల్స్‌ను స్వాధీనం చేసుకోవాలని ఫిబ్రవరి 28న ఎస్‌ఈసీ కలెక్టర్లను ఆదేశించింది. ఆ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఎస్‌ఈసీ ఆదేశాల అమలును నిలిపేస్తూ సింగిల్‌ జడ్జి ఈనెల 3న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులపై ఎస్‌ఈసీ శుక్రవారం సాయంత్రం అత్యవసరంగా అప్పీల్‌ చేయగా కోర్టు మరోసారి ఉత్తర్వులు ఇచ్చింది