కేంద్రానికి వైఎస్ జగన్ రాసే లేఖలతో ప్రయోజనమేంటి.?

Ys Jagan's Letters To Modi Govt

Ys Jagan's Letters To Modi Govt

ప్రత్యేక హోదా విషయమై లేఖలు రాశారు.. ప్రయోజనం లేదు. విశాఖ స్టీల్ ప్లాంటు విషయమై కేంద్రానికి లేఖలు రాశారు.. కానీ, కేంద్రం పట్టించుకోలేదు. చాలా అంశాలున్నాయి ఇలాంటివి చెప్పుకోడానికి. కీలకమైన లేఖల్ని కేంద్రం పట్టించుకోవడంలేదు.

మరికొన్ని విషయాల్లో మాత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్రం తీపి కబురు అందిస్తుండడం ఆశ్చర్యకరమైన విషయమే. అయితే, అవి కేంద్రం తగిన నిర్ణయాలు తీసుకుందని ఢిల్లీ నుంచి లీకులు అందిన తర్వాత రాసిన లేఖలా.? అన్న అనుమానం విపక్షాల్లో వుందనుకోండి. అది వేరే సంగతి. ఇప్పుడు కృష్ణా జలాల విషయమై తలెత్తిన వివాదానికి సంబంధించి పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు.. అదేనండీ కేంద్ర మంత్రులకు పదే పదే లేఖలు రాస్తున్నారు ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.

నిజానికి, బీజేపీకి కాస్తో కూస్తో మిత్రుడంటే వైఎస్ జగన్ మాత్రమే. కేసీయార్ విషయంలో బీజేపీకి ఆ స్నేహం అందడంలేదు. తెలంగాణలో టీఆర్ఎస్ – బీజేపీ మధ్య వైరం నడుస్తోంది. అదీ చాలా తీవ్రంగా వుంది. ఏపీలోనూ బీజేపీ, వైసీపీ మీద విమర్శలు చేసినా, జాతీయ స్థాయి నాయకత్వం మాత్రం వైసీపీతో సన్నిహితంగానే వుంటుంది. ఆ లెక్కన, ఏపీ సీఎం జగన్ రాసే లేఖలకు కేంద్రం నుంచి సానుకూల స్పందన రావాలి.

కానీ, బీజేపీకి తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం.. ఏపీ ప్రయోజనాలతో పోల్చితే. ఔను, తెలంగాణలోనే బీజేపీకి కాస్త ఓటు బ్యాంకు వుంది, ఏపీతో పోల్చితే. అందుకే, ఏపీ విషయంలో వైఎస్ జగన్ ప్రతిపాదనల్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆమోదించే అవకాశం లేదు.

ఎగువ రాష్ట్రం నీటిని వృధాగా (విద్యుత్ కోసం వాడేసి..) కిందికి వదిలేస్తే, దిగువ రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ ఆ నీటిని వాడుకునే పరిస్థితి లేదు. ఈ విషయం కేంద్రానికి తెలియనిది కాదు. కానీ, కేంద్రం జోక్యం చేసుకునే పరిస్థితే కనిపించడంలేదు. అయినాగానీ, జగన్.. లేఖలు రాయక తప్పదంతే.