ఆంధ్రప్రదేశ్‌లో అదఃపాతాళానికి పడిపోయిన రాజకీయం

రాజకీయం ఇలా కూడా చేస్తారా.? అని సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే స్థాయికి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు దిగజారిపోయాయి. రాజకీయాల్లో బూతులు మాట్లాడటం అనేది సర్వసాధారణమైపోయిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో వుంటుందన్నది నిర్వివాదాంశం.

మంత్రులే బూతులు మాట్లాడుతోంటే, రాజకీయం ఇంకెలా వుంటుంది.? మేం చేస్తే సంసారం, ఇంకెవడన్నా చేస్తే వ్యభిచారం.. అన్న స్థాయికి రాజకీయ నాయకులు, పార్టీలు వ్యవహరిస్తున్నారు. అధికార పక్షం, ప్రతిపక్షం.. అన్న తేడాల్లేవ్. అందరూ కలిసికట్టుగా రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించేస్తున్నారు.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ అనాధగా మారిన మాట వాస్తవం. అలాంటి రాష్ట్రాన్ని అందరూ కలసికట్టుగా వుండి అభివృద్ధి చేసుకోవాల్సింది పోయి, అందరూ కలిసికట్టుగా రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించేస్తున్నారు. ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యాలయాలపై అధికార పక్షం దాడులు చేయడమా.? ఇదెక్కడి సంస్కృతి.?

టీడీపీ నేతలు మాట్లాడింది ముమ్మాటికీ తప్పే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, మంత్రి కొడాలి నాని అను నిత్యం వాడుతోన్న బూతులు, అధికార పార్టీకి ప్రవచనాల్లా కనిపిస్తున్నాయా.? బూతులు తిడితే, పార్టీల కార్యాలయాలపై దాడులు చేయాలన్నదే వైసీపీ సిద్ధాంతమైతే, వైసీపీ కార్యాలయాలు ఎన్నిసార్లు ధ్వంసమైపోవాలి.?

సరే, రాజకీయాలన్నాక ఇలాంటి ఉద్రిక్తతలు కొంతమేర మామూలే కావొచ్చు. కానీ, హోంమంత్రి మేకతోటి సుచరిత.. ఈ రాజకీయ దాడుల్ని ఖండించకపోతే ఎలా.? బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పకపోతే ఎలా.? రాజకీయం వేరు, ప్రభుత్వం వేరు. కానీ, ప్రభుత్వమే రాజకీయమైపోయింది.

గతంలో వైఎస్ జగన్ మీద కోడి కత్తితో దాడి జరిగినప్పుడు అత్యంత హేళనగా అప్పటి టీడీపీ ప్రభుత్వం వ్యవహరించింది కాబట్టి, వైసీపీ ఇప్పుడు అధికారంలో వుండి అదే తీరు ప్రదర్శిస్తోందని వైసీపీ నేతలు సమర్థించుకుంటే, 2019 ఎన్నికల్లో టీడీపీకి పట్టిన గతి, 2024 ఎన్నికల్లో వైసీపీకి పడుతుందని కూడా వారు అంగీకరిస్తున్నట్టే లెక్క.