కేటీయార్, రేవంత్ ప్రశ్నల గోల.! ఎందుకిలా.?

Amit Shah : కేంద్ర మంత్రి, బీజేపీ ముఖ్య నేత అమిత్ షా తెలంగాణకు వస్తారన్న వార్త వినగానే తెలంగాణలో అధికారంలో వున్న తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణలో అధికారం కోసం చూస్తోన్న కాంగ్రెస్ పార్టీ కంగారు పడ్డాయో, గొంతు చించుకున్నాయో.. ఏదన్నా అనండి.. రెండు పార్టీల నుంచీ ప్రశ్నా పత్రాలు బయటకు వచ్చాయి. ఆ ప్రశ్నా పత్రాలను చూసి, సమాధానాలు రాసి.. ఆ రెండు పార్టీల నుంచీ అమిత్ షా మార్కులేయించుకోవాలన్నమాట.

బీజేపీ ఓ జాతీయ పార్టీ. తెలంగాణలో బలపడాలనుకుంటోంది. ఆ బీజేపీ తరఫున కేంద్ర మంత్రి, ఆ పార్టీ ముఖ్య నేత తెలంగాణకు వచ్చారు. పార్టీ శ్రేణులకు ఏదో దిశా నిర్దేశం చేస్తారు. దీనికి కాంగ్రెష్, టీఆర్ఎస్ ఎందుకు కంగారు పడాలి.? ఆయా పార్టీల అత్యాశ కాకపోతే, అమిత్ షా ఎందుకు ఆ పార్టీల ముఖ్య నేతలు సంధించే ప్రశ్నలకు సమాధానమిస్తారు.?

తాము అధికారంలోకి వచ్చాక దేశాన్ని ఉద్ధరించే కార్యక్రమం చేపట్టామని అమిత్ షా చెప్పడం మామూలే. ఆ దేశంలోనే తెలంగాణ వుంది కాబట్టి, నరేంద్ర మోడీ ప్రభుత్వం.. తెలంగాణని కూడా ఉద్ధరించేసినట్టే లెక్క. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణలో చేపట్టిన యాత్రకు సంబంధించి మద్దతు పలికేందుకు అమిత్ షా వచ్చారు. సో, బీజేపీ శ్రేణుల్లో ఆయన ఉత్సాహం నింపడం అనేది సర్వసాధారణమైన విషయం.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయాక, రెండు రాష్ట్రాల మధ్య పంచాయితీ తేలకపోవడంపై కేంద్రానిదే పాపమంటోంది తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ విషయంలో కొంత అటూ ఇటూగా స్పందిస్తోంది.

సరే, ఇన్నేళ్ళపాటు కేంద్రంలో బీజేపీకి, తెరవెనుకాల సహకరించి, ఇప్పుడు ప్రశ్నా పత్రం సంధించే గులాబీ పార్టీ, అసలు తెలంగాణలో వుందో లేదో తెలియని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన క్వశ్చన్ పేపర్.. వీటికి బీజేపీ ఎంత విలువ ఇస్తుందట.?