మూడు రాజధానుల చట్టాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అయితే, ‘ఇది ఇంటర్వెల్ మాత్రమే..’ అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు, ‘మరింత మెరుగైన వికేంద్రీకరణ బిల్లు తీసుకొస్తాం..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన, ‘తగ్గదే లే..’ అంటున్న వైసీపీ నేతల మాటలు.. అమరావతి ఉద్యమానికి కొత్త ఊపిరి పోస్తున్నాయన్నది నిర్వివాదాంశం.
ఆలస్యం అమృతం విషం.. అని ఇలాంటి సందర్భాల్లోనే అనాల్సి వస్తుంటుంది. గడచిన రెండేళ్ళ కాలంలో వైఎస్ జగన్ సర్కార్, మెరుగైన వికేంద్రీకరణ బిల్లుని తీసుకురావడంలో ఎందుకు విఫలమయ్యింది.? అన్న ప్రశ్న తెరపైకి రావడం సహజం. రెండేళ్ళ తర్వాత ‘మరింత మెరుగైన బిల్లుని తీసుకొస్తాం..’ అని చెప్పడం అస్సలేమాత్రం సమర్ధనీయం కాదు.
ప్రధానంగా సీఆర్డీయే రద్దు చట్టం ఉపసంహరణతో, అమరావతి ఉద్యమానికి కొత్త ఊపిరి ఊదినట్లయ్యింది. అది అధికార వైసీపీకి ముందు ముందు మరింత పెద్ద తలనొప్పి కాబోతోంది.
ప్రభుత్వం ఎంత గొప్పగా ఇంకోసారి వికేంద్రీకరణ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చినా, దానిపైనా న్యాయ సమీక్షకు అవకాశం వుంటుంది. న్యాయస్థానాల్లో మళ్ళీ కేసులు పడితే.. మరికొన్నాళ్ళు ఆ వ్యవహారం నానుతుంది. అలా నాన్చివేత ఎక్కువ కాలం కొనసాగితే, ముమ్మాటికి అది వైసీపీకే డిజడ్వాంటేజ్ అవుతుందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మనసులో వికేంద్రీకరణ విషయమై ఎలాంటి అభిప్రాయం వుందోగానీ, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలో మాత్రం తప్పటడుగులు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి.