అమర్ రాజా వ్యవహారం: వైసీపీ పాలనకు అతి పెద్ద షాక్

తప్పో ఒప్పో.. ప్రభుత్వంలో వున్నవారంతా ఒకే మాట మీద వుండాలి. కానీ, ‘మేమే వెళ్ళిపోమన్నాం..’ అంటూ అమర్ రాజా బ్యాటరీస్ వ్యవహారంపై ప్రభుత్వం తరఫున ప్రకటనలు వస్తూనే, ఇంకోపక్క, ‘లాభాలు ఎక్కడొస్తే అక్కడికి పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోతారు.. మేమేం వెళ్ళిపోమనలేదు..’ అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారంటే.. అసలేం జరుగుతోందని అనుకోవాలి.? చిత్తూరు జిల్లాలో వున్న అమర్ రాజా బ్యాటరీస్ పరిశ్రమల్లో కాలుష్యం చాలా ఎక్కువగా వుంటోందన్నది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే, ఆ పరిశ్రమల మూసివేత దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పలుమార్లు అవకాశమిచ్చినా లోపాల్ని సంస్థ సరిదిద్దుకోలేదన్నది ప్రభుత్వం వాదన. హైకోర్టు కూడా, అమర్ రాజా సంస్థలో కాలుష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. మరోపక్క, మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.

కాగా, ప్రభుత్వ వేధింపుల వల్లే అమర్ రాజా పరిశ్రమ వెళ్ళిపోతోందంటూ మీడియాలో వచ్చిన కథనాలపైనా ప్రభుత్వ పెద్దలు గుస్సా అవుతుండడం గమనార్హం. కాలుష్యం లేని పరిశ్రమల్ని ఊహించగలమా.? అందునా, వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక.. కాలుష్యం పేరుతో పరిశ్రమలు చాలా చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. పరిశ్రమల్లో ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. ఎల్జీ పాలిమర్స్ సంస్థ విషయంలో ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరించిందన్న విమర్శ వుంది. కానీ, అమర్ రాజా వ్యవహారంలో ఎందుకీ అత్యుత్సాహం.? అంటే, అది ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌కి చెందిన పరిశ్రమ కాబట్టి.. అన్న సమాధానం సహజంగానే తెరపైకొస్తోంది. ప్రభుత్వంలో వున్నవారి నుంచి భిన్నమైన వాదనలు తెరపైకొచ్చినప్పుడు.. సహజంగానే కొత్త అనుమానాలు కలుగుతాయి. పొరుగు రాష్ట్రాలు సదరు పరిశ్రమను ఆహ్వానిస్తున్నాయంటే, దాన్నుంచి కాలుష్యం నిజంగానే వస్తోందని ఎలా అనుకోగలం.?