రాజకీయాల్లో ఓడలు బళ్ళవుతాయి.. బళ్ళు ఓడలవుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అధికారంలో వున్నప్పుడు విర్రవీగితే, అధికారం కోల్పోయాక అత్యంత దయనీయ స్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది ఎవరైనాసరే. చంద్రబాబుకి ఇప్పుడు అదే అనుభవం ఎదురవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీతో చీకటి ఒప్పందాలు చేసుకుని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కుట్ర పూరితంగా కేసులు నమోదు చేయించారన్నది చంద్రబాబుపై చాలాకాలంగా వినిపిస్తోన్న ఆరోపణ. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ, తమను ఎదిరించిన జగన్‌ని ఇరకాటంలో పెట్టేందుకు చంద్రబాబుతో చేతులు కలిపిందని అంటారు చాలామంది. ఆ సంగతి పక్కన పెడితే, తాను ముఖ్యమంత్రిగా వున్నన్నాళ్ళూ అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్‌ని ఉద్దేశించి ‘దొంగ, ఏ1’ అంటూ చంద్రబాబు చేసిన విమర్శల్ని ఎలా మర్చిపోగలం.? ఇప్పుడు చంద్రబాబు పేరు ‘ఏ1’గా చేర్చబడింది అమరావతి భూముల కుంభకోణానికి సంబంధించిన వ్యవహారంలో.
ఆరోపణలు రాగానే దోషి కాదు. విచారణలో ఎవరు దోషి.? ఎవరు నిర్దోషి.? అన్నది తెలుస్తుంది. అప్పటిదాకా ఏ కేసులో ఎవరి మీద ఆరోపణలు వున్నా, వాళ్ళ పేర్లు నిందితుల జాబితాలో మాత్రమే చేర్చబడతాయి. సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకి ఈ వివరాలు తెలియవని ఎలా అనుకోగలం.? తనదాకా వచ్చేసరికి, ‘సీఐడీ నోటీసులు ఇచ్చి ఏ1 అని పేర్కొంటే, చంద్రబాబు నేరస్తుడైపోతారా.?’ అని టీడీపీ నేతలు ప్రశ్నించేస్తున్నారు. ‘రాజకీయ కుట్ర’ అంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇదే, వైఎస్ జగన్ విషయంలో కూడా వర్తిస్తుంది కదా.? మరోపక్క, మూడో వర్గం ‘ఔను వైఎస్ జగన్ మీద కూడా అభియోగాలు మోపబడ్డాయి.. చంద్రబాబు మీదా అభియోగాలు మోపబడ్డాయి.. ఇరువురి ఆరోపణలూ నిజమైతే ఇద్దరూ దోషులే అవుతారు..’ అంటూ సందట్లో సడేమియా పండగ చేసుకుంటుండడం గమనించాల్సిన మురో ఆసక్తికర అంశం.