ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇంకా ఢిల్లీకి వెళ్లనేలేదు. అప్పుడే కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేసింది. జగన్ సర్కార్ కు కేంద్రం తీపి కబురు చెప్పింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులను విడుదల చేసేందుకు కేంద్రం ఓకే చెప్పేసింది.
నిజానికి పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు. చాలా ఏళ్ల కింద ప్రారంభం అయిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు కేంద్రం నుంచి రాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే సొంత ఖర్చులతో ప్రాజెక్టును చేపడుతున్నది. జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి కూడా నిధులు రావాలి. కానీ.. గత ప్రభుత్వ హయాంలో కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టుకు రూపాయి రాలేదు.
వైసీపీ ప్రభుత్వం రాగానే… ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ ఎంపీలు, మంత్రులు పోలవరం నిధులు విడుదల చేయాలంటూ కేంద్రాన్ని కోరుతూనే ఉన్నారు. తాజాగా… పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధుల్లో 2300 కోట్లను రీయింబర్స్ చేసేందుకు కేంద్రం ఒప్పుకుంది. దీనికి సంబంధించిన ఫైలుపై కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సంతకం పెట్టి ఫైలును ఆర్థిక శాఖకు పంపించారు.
పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా బహిరంగ మార్కెట్ లో బాండ్ల ద్వారా రుణాలను సేకరించి… ఏపీ ప్రభుత్వానికి నిధులు విడుదల చేయాలని నాబార్డును కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. దీంతో ఓ వారం లోపు రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు రానున్నాయి.
ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, వైసీపీ ఎంపీలు ఢిల్లీలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రతిపాదించిన 2300 కోట్లను విడుదల చేయడంతో పాటు మిగిలిన నిధులు 1758 కోట్లను మరో విడతలో విడుదల చేయనున్నట్టు కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. మొత్తం మీద పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్రానికి రావాల్సిన 4 వేల కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు త్వరితగతిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని.. మంత్రి అనిల్ కుమార్ తెలిపారు.