రాజధాని అమరావతి భూ కుంభకోణంపై సీఐడీ విచారణ వేగవతం చేసిందా? ఇక వరుస అరెస్ట్ లు తప్పవా? అంటే అవుననే చెబుతోంది తాజా సన్నివేశం. టీడీపీ పార్టీ హయాంలో రాజధాని కుంభకోణం ఆరోపణలపై ఇప్పటికే సీఐడీ పలువుర్ని విచారించి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వాళ్ల నుంచి అధికారులు కీలక సమాచారం రాబట్టారు. అయితే ఇంకా పెద్ద తలకాయలేవి ఈ కుంభకోణంలో బయటపడలేదు. ఈ నేపథ్యంలో తాజాగా బుధవారం మరో ఇద్దరిని అరెస్టు చేసింది. భూ రికార్డులను తారుమారు చేసి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కోంటున్న తుళ్లూరు రిటైర్డ్ తహసీల్దార్ సుధీర్ బాబు, అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన గుమ్మడి సురేష్ అనే వ్యక్తిని సీఐడీ అదుపులోకి తీసుకుంది.
అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సుధీర్ అత్యంత సన్నిహితంగా ఉన్నట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సీఐడీ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి అరెస్ట్ తో ల్యాండ్ పూలింగ్ లో అక్రమాలకు పాల్పడ్డ టీడీపీ నేతల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. చోటా మోటా నాయకుల నుంచి ఈ కుంభకోణంలో పెద్ద తలకాయలే ఉన్నాయని విచారణలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ పేరు సహా పలువురు సీనియర్ నేతల పేర్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.
అలాగే నెక్కల్లు డిప్యూటీ కలెక్టర్ కనికెళ్ల మాధురిని పోలీసులు ఇదివరకే అరెస్టు చేసారు. అయితే తర్వాతి కాలంలో సీఐడీ విచారణ స్పీడ్ తగ్గించింది. తాజాగా మరో ఇద్దరు అరెస్ట్ అవ్వడంతో విచారణ వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈఎస్ కుంభకోణంలో టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు, అక్రమవాహనాల కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇంకా పలువురి టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. మరో టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఓ మర్డర్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇలా వరుస అరెస్ట్ లతో టీడీపీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది.