తెలంగాణ రాష్ర్ట సీఎం కేసీఆర్, కేటీఆర్ లపై బీజీపీ ధర్మపురి ఎంపీ అరవింద్ వరంగల్ పర్యటనలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రజలు కష్టాల్లో ఉంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఆయన నిర్లక్ష్యం వల్లే కేంద్ర సహాయాన్ని కూడా అందుకోలేకపోతున్నారని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ ఆయన చెంచాలు కేంద్రంపై అర్ధంలేని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ది పనులు చేస్తుందని…కానీ కేసీఆర్ కథలు పడుతున్నారని తూర్పూరా బట్టారు. కేంద్రం 20 లక్షల కోట్ల ప్యాకేజీ అందించింది. కష్టకాలంలో ఇది ఎంతో గొప్ప ప్యాకేజీ. కానీ కేసీఆర్ వాస్తవాలు మాట్లాడటం మానేసి అవాకులు, చెవాకులు పేలుతున్నారని దుయ్యబెట్టారు.
తాజాగా ఈ వ్యాఖ్యలపై టీఆర్ ఎస్ నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. కొంత మంది కార్యకర్తలు ఏకంగా ఎంపీపై దాడికే దిగారు. అరవింద్ ప్రయాణిస్తున్న కారుపై కోడి గుడ్లతో దాడి చేసారు. పోలీసుల సమక్షంలోనే టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బీజీపే-టీఆర్ ఎస్ కార్యకర్తలు ఒకర్ని ఒకరు దూషించుకుంటూ తోసుకున్నారు. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జీహెచ్ ఎంసీ పరిధిలో కరోనా కేసులు ఎక్కువవుతోన్న నేపథ్యంలో కేసీఆర్ 14 రోజుల పాటు ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండా ఫామ్ హౌస్ కి పరిమితయ్యారు. ఇదే సమయంలో ప్రయివేటు ఆసుపత్రులు కరోనా పేరు చెప్పి కోట్ల రూపాయలు దోచుకున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనాకి సరైన వైద్యం అందించడంలో విఫలమైందంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ సహా సోషల్ మీడియా వేదికగా ప్రజలు ప్రభుత్వాన్ని దుయ్య బెట్టిన సంగతి తెలిసిందే.