జనసేన నెత్తిన పాలు పోస్తున్న వైసీపీ, టీడీపీ కోట్లాట

ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, కొనసాగుతున్న అరెస్టుల పర్వాలు ప్రజల్లో హాట్ టాపిక్ అయ్యాయి.  ఇప్పటికే టీడీపీ నుండి కీలక నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ అరెస్టయ్యరు.  వెంటవెంటనే జరిగిన ఈ అరెస్టులతో వైసీపీ, టీడీపీల మధ్యన పోరు తారా స్థాయికి చేరింది.  జగన్ కావాలనే కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని చంద్రబాబు నాయుడు సహా తెలుగుదేశం కీలక నేతలందరూ ఆరోపిస్తున్నారు.  అధికార పక్షం మాత్రం అవినీతి జరిగింది కాబట్టే అరెస్టులని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అంటున్నారు. 
 
అంతేకాదు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ నేతల మీద కేసులు పెట్టలేదా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారి మీద కేసులు మోపి, సీబీఐ విచారణ జరిపి జైలుకు పంపలేదా.  అవి కక్షపూరిత చర్యలు కానప్పుడు ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు కక్ష సాధింపులు ఎలా అవుతాయి అంటూ లాజిక్ మాట్లాడుతున్నారు.  ఈ వ్యవహారం చూస్తున్న జనంలోని వైసీపీ మద్దతుదారులు టీడీపీకి కావాల్సిందే, మా జగన్నను ఎన్ని తిప్పలు పెట్టారు అంటుంటే టీడీపీ సానుభూతిపరులు జగన్ నియంత తరహా పాలన చేస్తున్నారని వాపోతున్నారు. 
 
ఈ పరిణామాల మధ్య తటస్థుల దృష్టి జనసేన పార్టీ మీద పడుతోంది.  రాజకీయాలు పారదర్శకంగా ఉండాలని, ఎవరు అధికారంలో ఉన్నా నిజాయితీ పాలన అందివ్వాలని కోరుకునే ఈ సెటిల్డ్ ఓటర్స్ ఏ పార్టీ మీదా ప్రత్యేక అభిమానం చూపరు.  ఎన్నికల నాటికి వారికి ఏ పార్టీ మీద గురి కుదిరితే ఆ పార్టీకి ఓటు వేస్తారు.  ఓటర్లు రెండు ప్రధాన పార్టీల నడుమ చీలిపోయిన నేపథ్యంలో ఈ తటస్థులే అధికారం ఎవరి చేతిలో ఉండాలో డిసైడ్ చేస్తుంటారు.  ఇప్పుడు ఈ ప్రధాన వర్గం చూపు జనసేన మీద పడుతోంది. 
 
ప్రశాంత రాజకీయాలు కొరుకునే వీరు గతంలో టీడీపీ అధికారంలో ఉండగా వైసీపీ కష్టాలు పడింది, ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చేసరికి టీడీపీకి ఊపిరి ఆడటం లేదు.  రేపు ఒకవేళ అధికారం టీడీపీ హస్తగతమైతే వైసీపీకి ముప్పు తప్పదు.  ఇలా ఒక ప్రధాన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండో ప్రధాన పార్టీ స్వీయరక్షణలోనే ఉండాల్సి వస్తుంది.  మరి వీరెప్పుడు ప్రతిపక్ష పాత్రను పోషిస్తారు, అధికార పక్షం చేత ఎప్పుడు పని చేయిస్తాటు.  అసలు ఆరోపణలు, అరెస్టుల వరకు వ్యవహారం వెళుతోందంటే తప్పు జరిగే ఉంటుంది.  ఇలాంటి పార్టీల వలన రాజకీయాల్లో బ్యాలెన్స్, క్రమశిక్షణ లోపిస్తున్నాయి అనుకుంటున్నారు. 
 
అంతేకాదు పక్కన జనసేన పార్టీ ఉంది.  వైసీపీ, టీడీపీలతో పోలిస్తే చిన్న పార్టీయే అయినా ఇలాంటి పొలిటికల్ సర్కస్లలో నలగడం లేదు.  ఇంతవరకు జనసేన ప్రశ్నించడం తప్ప ఆ పార్టీని ప్రశ్నించినవారు, న్యాయ వ్యవస్థల ముందు నిలబెట్టినవారు లేరు.   ఆ పార్టీలో ఉన్న  నేతలు కొద్దిమందే అయినా వారి మీద ఎలాంటి అభియోగాలు లేవు.  కాబట్టి అధికార పక్షం నుండి వీరికి ఇబ్బందులు ఉండవు.  వీరైతే భయపడకుండా ప్రతిపక్ష పాత్ర సరిగ్గా నిర్వహించగలరు అనుకుంటున్నారు.  ఈ తరహా అభిప్రాయం తటస్థ ఓటర్లలో రావడం అనేది నిజంగా జనసేనకు మేలు చేసే విషయమనే అనాలి.