జనసేన ఎమ్మెల్యే ఓటు వైసీపీకే.. రగులుతున్న జనసైనికులు 

ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.  వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు జనసేన నుండి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రపాన వరప్రసాద్ కూడా ఓటింగ్లో పాల్గొన్నారు.  వైసీపీ నుండి నలుగురు అభ్యర్థులు అయోధ్య రామయ్య, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ, మోపిదేవి వెంకటరమణ బరిలో ఉండగా టీడీపీ నుండి వర్ల రామయ్య పోటీలో ఉన్నారు.  సంప్రదాయం ప్రకారం వైసీపీ, టీడీపీలు తమ అభ్యర్థులకే ఓటు వేయమని ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసుకున్నాయి.  ఆ ప్రకారమే వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలు వారి నలుగురి అభ్యర్థులకి ఓట్లు వేస్తున్నారు. 
 
ఇక టీడీపీ అయితే ఓటమి తప్పదని తెలిసీ వర్ల రామయ్యను బరిలో నిలిపింది.  ఆ పార్టీ ఎమ్మెల్యేలు 23 మంది కాగా అందులో వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధరరావు, కరణం బలరామ్ బయటకు వచ్చేశారు.  దీంతో ఈ ముగ్గురిని ఇరకాటంలో పెట్టడానికే టీడీపీ విప్ జారీచేసి పోటీలో నిలిచింది.  విప్ దిక్కరిస్తే వారి మీద అనర్హత వేటు వేయడానికి సిద్దంగా ఉంది.  ఇక జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఎప్పటి నుండో జగన్, వైసీపీకి మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే.  పలుసార్లు బాహాటంగా జగన్ పాలన బాగుందని ఆయనకు పాలాభిషేకాలు చేసిన రాపాక పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాటని కూడా కాదని అసెంబ్లీలో ఒక కీలక బిల్లు విషయంలో జగన్ సర్కారుకు మద్దతు పలికారు. 
 
దాంతో పవన్ ఆయన్ను దూరం పెట్టారు.  జనసేన శ్రేణులైతే రాపాక తమ ఎమ్మెల్యే అనే సంగతినే మర్చిపోయారు.  అలా జనసేనకు దూరంగా ఉన్న రాపాక ఈరోజు ఎన్నికల్లో వైసీపీకే ఓటు వేశారు.  తాను ఇప్పటికీ జనసేన ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాను అంటూనే ఇష్టం వచ్చిన అభ్యర్థికి ఓటు వేయవచ్చు.  అందుకే వైసీపీకి వేశా.  ఎన్నికల విషయంలో పార్టీ పెద్ద నుండి ఎలాంటి సూచనా రాలేదు.  టీడీపీది నామమాత్రపు పోటీనే.  అధికార పక్షానికి ఓటు వేస్తేనే మంచిది అంటూ మొహమాటం లేకుండా మాట్లాడారు.  ఆయన మాటలతో షాక్ తిన్న జనసైనికుల్లో అసహనంతో రగిలిపోతూ కోపాన్ని సోషల్ మీడియాలో వెళ్లగక్కుతున్నారు.