అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల నడుమ పోరు పలు రూపాలను సంతరించుకుంటోంది. అవినీతి ఆరోపణలతో టీడీపీ సీనియర్ లీడర్లను ప్రభుత్వం జైళ్లకు తరలిస్తుంటే ప్రతిపక్షం అవి కక్షపూరిత చర్యలని అంటూనే జగన్ తీసుకుంటున్న కీలక నిర్ణయాలకు బ్రేకులు వేయడం కోసం శాసన మండలిలో మూడు రాజధానుల బిల్ పాస్ కాకుండా మండలి నివధిక వాయిదా పడేట్టు చేసింది. ఇవి చాలవన్నట్టు తనపై ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారని నారా చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డే ఆ వార్తల వెనకున్నారని అంటున్నారు.
ప్రస్తుతం కేంద్ర స్థాయిలో భారత్ మీద చైనా దుశ్చర్యలు, భారత సైనికులు 20 మందిని చైనా సైన్యం చంపడం అనేవి ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. చైనా విషయంలో ఎలా ముందుకెళ్ళాలని ప్రధాని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తనకు ఫోన్ చేసి చైనా వివాదంలో ఏం చేయాలని సలహాలు అడిగారని, తాను కూడా సలహాలు ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు పేరు మీద ఒక ట్విట్టర్ పోస్ట్ వెలువడింది. బాబుగారు కేంద్రంలో తనకు పలుకుబడి ఎక్కువని అప్పుడప్పుడు అంటుంటారు కాబట్టి ఆ మాటలపై వ్యంగ్యాస్త్రంగా ఈ ఫేక్ పోస్టును వదిలారు గుర్తు తెలియని వ్యక్తులు.
దీన్ని చూసి చంద్రబాబుగారు బాగా నొచ్చుకున్నారు. వెంటనే వైఎస్ జగన్ లాంటి క్రిమినల్స్, ఆయన అనుచరులు మాత్రమే ఇలాంటి ఫేక్ వార్తలు ప్రచారం చేసి వేరొకరి ప్రతిష్టకు భంగం కలిగిస్తారని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వైసీపీ ఇలాంటి ఫేక్ పోస్టులు ప్రచారం చేయడం చూస్తే విసుగుపుడుతోందని అన్నారు. చంద్రబాబుగారు ఇలా ఫేక్ ట్విట్టర్ పోస్ట్ విషయంలో ప్రత్యక్షంగా ముఖ్యమంత్రినే బాద్యుడిని చేసి విరుచుకుపడటం చూస్తే ఆయనలో అధికార పక్షం మీద అసహనం ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది.
