ఆంధ్రా విషయంలో బిజెపి క్లారిటీ చూస్తే మైండ్ పోతుంది మరి 

ఆంధ్రాలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని భారతీయ జనతా పార్టీ కృత నిశ్చయంతో ఉంది.  ఈ ప్రయత్నం 2014 ఎన్నికల సమయంలోనే మొదలైనా ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల మూలంగా నెమ్మదించింది.  పార్టీకి రాష్ట్రంలో మద్దతు లేకపోవడం, జనాకర్షణ కలిగిన నేతల పొత్తులు లేకపోవడంతో భాజాపాను ఏపీ జనం ఇప్పటివరకు లైట్ తీసుకుంటూ వచ్చారు.  భాజాపా అంటే కేంద్ర రాజకీయాలకు మాత్రమే పరిమితం చేసి చూస్తున్నారు తప్ప సొంత రాష్ట్రంలోని పార్టీ అన్నట్టు చూడట్లేదు. 
 
ఇకపై ఈ పద్దతిని మార్చాలని కమల దళం నిర్ణయించుకుంది.  రాష్ట్ర రాజకీయల్లో తామూ ఉన్నామని జనం అనుకునేలా చేయడానికి విధివిధానాలను రూపొందించుకుంది.  అందుకే జనసేనతో పొత్తు పెట్టుకుంది.  ఈ పొత్తు విషయంలో భాజాపా అధిష్టానం చాలా స్పష్టంగా ఉంది.  జనసేనతో దోస్తీ అంటే కేవలం జనసేనతోనై దోస్తీ.  మధ్యలో మూడవ పార్టీకి స్థానం లేదు.  అందుకే రెండు ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీల విషయంలో కూడా స్పష్టమైన స్టాండ్ ఏర్పాటు చేసుకున్నారు.  ఇన్నాళ్ళు భాజాపా శ్రేణులు టీడీపీకి అనుకూలంగా కొందరు  వైసీపీకి అనుకూలంగా కొందరు ఉండేవారు. 
 
కానీ ఇకపై అలాంటివి కుదరదు.  ఆ రెండు పార్టీల విషయంలో తటస్థ వైఖరి అవలంభించాలని.. అంటే నిజంగా చప్పట్లు కొట్టాల్సి వచ్చినప్పుడు చప్పట్లు, తిట్లు తిట్టాల్సి వచ్చినప్పుడు తిట్లు అన్నట్టు డిసైడ్ అయ్యారు.  అందుకు నిదర్శనమే తాజాగా పార్టీలో చోటు చేసుకున్న లక్ష్మీపతి రాజా సస్పెన్షన్.  అచ్చెన్నాయుడు అరెస్టులో ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కన్నా లక్ష్మీనారాయణ స్టెట్మెంట్ ఇచ్చారు.  కానీ లక్ష్మీపతి రాజా మాత్రం వైసీపీ చేసింది తప్పన్నట్టు మాట్లాడారు.  
 
దీంతో క్రమశిక్షణ ఉల్లంఘన కింద నిన్న ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు.  అలాగే మరో ఇద్దరు నేతలు కిలారు దిలీప్  రామకోటయ్యలు కూడా టీడీపీకి మద్దతిచ్చే రీతిలో మాట్లాడటంతో వారికీ షోకాజ్ నోటీసులు వెళ్లాయి.  దీన్నిబట్టి ఏపీలో భాజాపా వచ్చే ఎన్నికల నాటికి జనసేనతో కలిసి బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని బలంగా ట్రై చేస్తున్నట్టు రూఢీ అయింది.  భారతీయ జనతా పార్టీలో ఈ స్థాయి క్లారిటీ, కార్యాచరణ ఇదివరకు ఎన్నడూ కనిపించలేదు.