తెలుగు దేశం పార్టీకు పాత వైభవం తీసుకురావడానికి నారా చంద్రబాబు నాయుడు కసరత్తులు చేస్తున్నారు. చతికిలబడిన పార్టీకి తిరిగి ఊపిరిలూదే కార్యాచరణను సిద్దం చేస్తున్నారు. పార్టీతో పాటే కుమారుడు నారా లోకేష్ ను ఎలివేట్ చేసే ప్లాన్ కూడా రెడీ అవుతోందట. అదే పాదయాత్ర. ఏపీ రాజకీయాల్లో ఉద్యమాలకు పెద్దగా తావులేకపోయినా యాత్రలకు మంచి ప్రాధాన్యం ఉంది. అధికారంలోకి రావాలి, నాయకుడిగా ఎదగాలనే తపనతో యాత్రలు చేసి ప్రజల ముందుకు వెళ్లిన నాయకులు ముఖ్యమంత్రులు అయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేలమట్టం చేయడానికి అన్నగారు ఎన్టీఆర్ తెలుగువాడి ఆత్మగౌరవం అనే నినాదం అందుకుని చైతన్య రథయాత్ర పేరుతో ప్రజల చెంతకు వెళ్లి ఆ తర్వాత జరిగిన ముందస్తు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి రికార్డ్ నెలకొల్పారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు కూడా తెలుగు దేశం హవాకు చెక్ పెట్టడానికి పాదయాత్ర చేశారు. కడప గడప దాటి ప్రజల్ని కలుసుకుని వారి బాధల్ని నేరుగా విన్నారు. అలా ఒక నాయకుడు నడుచుకుంటూ తమ వద్దకే రావడంతో ముగ్డులైన ఓటర్లు అయన్ను ముఖ్యమంత్రిని చేశారు.
ఆ తర్వాత గత ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర పేరుతో 341 రోజులు 3648 కిలోమీటర్ల నడిచి పల్లె పల్లెకూ వెళ్లి ఓటర్లను పలకరించారు. ఎన్నికల హామీలను వారి బాధల నుండే రూపొందించి మేనిఫెస్టో తయారుచేసుకున్నారు. ఈ పాదయాత్ర ఆయన్ను 151 అసెంబ్లీ సీట్లతో అధికారంలో కూర్చునేలా చేసింది. అందుకే నారా లోకేష్ సైతం పాదయాత్ర చేయాలని సంకల్పించారట. ఈ యాత్రకు ఇదివరకే ప్రణాళిక రెడీ అయినా కరోనా లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడింది.
అందుకే బాబు అండ్ కో కొత్త ప్లాన్ రెడీ చేస్తున్నారట. రాజకీయ వర్గాల సమాచారం మేరకు 2021 ఆరంభంలో ఈ యాత్ర ఉండవచ్చని తెలుస్తోంది. మరి ముగ్గుర్ని ముఖ్యమంత్రుల్ని చేసిన పాదయాత్ర నారా లోకేష్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. అసలు గత నాయకుల యాత్రలకు లోకేష్ యాత్రకు తేడా ఏమిటి, ఆ యత్ర ద్వారా ఆయన జనానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేదే ఆసక్తికరంగా మారింది.
