కేటీయార్‌పై షర్మిల వెటకారం.! ట్రోలింగ్ తీవ్రతరం.!

తెలంగాణ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కాలికి గాయం కావడంతో కొన్ని వారాల పాటు కాలు కదపలేని పరిస్థితుల్లో వున్న విషయం విదితమే. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు.

బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో, ఇంట్లోనే వుండాల్సి వస్తుంది గనుక.. ఓటీటీలో ఏం చూడొచ్చో తనకు సూచించాలని కేటీయార్ తన అభిమానుల్ని కోరారు. దానికి రకరకాలుగా ఆయన అభిమానులు స్పందిస్తున్నారు.

ఇక, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కూడా స్పందించారు. ‘కుట్ర సిద్ధాంతం.. క్లౌడ్ బరస్ట్ మరియు మునిగిపోయిన ఇళ్ళు, పంప్ హౌసులు..’ అంటూ ట్వీటేశారు వైఎస్ షర్మిల. ‘గెట్ వెల్ సూన్’ అని కూడా పేర్కొన్నారామె.

దాంతో, కేటీయార్ అభిమానుల నుంచి విపరీతమైన ట్రోలింగ్ షురూ అయ్యింది వైఎస్ షర్మిల మీద. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తి దాడి జరిగిన విషయాలు సహా, అనేక అంశాల్ని నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు.

అంతే కాదు, గతంలో వైఎస్ షర్మిల మీద కొందరు తీవ్రమైన దుష్ప్రచారం చేసినప్పుడు, అప్పట్లో వాటికి అడ్డుకట్ట వేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని నెటిజన్లు వైఎస్ షర్మిలకు గుర్తు చేస్తున్నారు. కొందరైతే, ఒకింత జుగుప్సాకరంగా వైఎస్ షర్మిలను ట్రోల్ చేస్తున్నారు.