ప్రఖ్యాత జర్నలిస్టు, బ్రిటన్ లోని భారత మాజీ హై కమీషనర్ కులదీప్ నయ్యర్ 95 కన్ను మూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్ధరాత్రి ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. కాలమిస్టుగా, మానవహక్కుల ఉద్యమకారుడిగా, రాజ్యసభ ఎంపీగా బహుముఖ పాత్ర కులదీప్ పోషించారు. అవిభక్త భారత్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న సియాల్ కోటలో 1923 ఆగష్టు 14న కులదీప్ జన్మించారు. నయ్యర్ ఉర్దూ ప్రెస్ రిపోర్టర్ గా పనిచేశారు. 1975-77లలో భారత ఎమర్జెన్సీ కాలంలో అరెస్టు అయ్యారు. 1996లో ఐక్యరాజ్య సమితికి వెళ్లిన భారతీయులలో కులదీప్ ఒకరు. 1990లో గ్రేట్ బ్రిటన్ హై కమీషనర్ గా బాధ్యతలు నిర్వహించారు. 1997 ఆగష్టులో రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
ఆయన పలు పత్రికలకు రచనలు, అనేక కాలమ్స్ రాశారు. వాటిలో ద డైలీ స్టార్, ద సండే గార్డియన్, ద న్యూస్ పాకిస్థాన్, ద స్టేట్స్ మన్ , ఎక్స్ ప్రెస్ ట్రిబూన్ పాకిస్థాన్, డాన్ పాకిస్థాన్ ముఖ్య మైనవి. తెలుగులో ఓ ప్రముఖ దిన పత్రికకు కాలమ్స్ రాశారు. కులదీప్ మృతికి పలువురు రాజకీయ, జర్నలిస్టు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. లోథిలో గురువారం మధ్యాహ్నం కులదీప్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.