అంగీకారంతో వ్యక్తి వేరొకరి భార్యతో సెక్స్ చేస్తే నేరం కాదు

భారతదేశ వివాహ వ్యవస్థ విశ్వసనీయతతో కూడుకున్నదని, అయితే, పెళ్లి చేసుకున్న తర్వాత భార్య…  భర్త సొత్తనడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఐపీసీ సెక్షన్ 497 రాజ్యాంగ బద్ధత, అడల్ట్రీపై చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో విచారణ జరిపిన జస్టిస్ నారిమన్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఏఎమ్ ఖాన్విల్కర్, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కూడిన బెంచ్, ఈ సెక్షన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు.

వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించే ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 497ను ఏకగ్రీవంగా కొట్టివేస్తూ చరిత్రాత్మక తీర్పును వెలువరించింది.

వివాహమైన పురుషుడు భార్యతో కాకుండా మరొక స్త్రీతో లైంగికంగా కలిస్తే అది నేరం కాదని న్యాయస్థానం చెబుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, అదే స్త్రీకి కూడా వర్తిస్తుందని, ఇద్దరి మధ్య పరస్పర అంగీకారంతో జరిగే కార్యంలో మహిళ బాధితురాలు కాదని, ఇద్దరిదీ సమాన బాధ్యతని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వివాహం తర్వాత స్త్రీ తన వ్యక్తిత్వం కోల్పోయేలా ఈ చట్టం ఉందని తెలిపింది.

చట్టాల పేరిట మహిళల వ్యక్తిగత గౌరవానికి భంగం వాటిల్లరాదని, వారికి కూడా స్వేచ్ఛ ఉండాల్సిందేనని, సెక్షన్ 497లోని ఎన్నో అంశాలు ఏకపక్షంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది. నైతిక విలువలతో పోలిస్తే, ప్రేమతో కూడిన విలువలకే ప్రాధాన్యత ఇస్తూ, ఈ తీర్పును ఇస్తున్నామని, పెళ్లైన వ్యక్తి మరొకరి భార్యతో శృంగారంలో పాల్గొంటూ పట్టుబడితే ఇద్దరూ శిక్షార్హులు కారని ఈ సందర్భంగా సీజే దీపక్ మిశ్రా తెలియజేశారు. వివాహేతర సంబంధం కారణంగా విడాకులు అడగొచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.