కన్నుకొట్టినా మోదీకి చీమకుట్టినట్లు కూడా లేదు -రాహుల్

కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఒకేలా ఉందన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఇద్దరూ మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఒక్కొక్కరి అకౌంట్ లో 15 లక్షలు వేస్తానని మోదీ, డబుల్ బెడ్ రూమ్ ఇస్తానని కేసీఆర్ ప్రజల్ని మోసం చేశారు. రాఫెల్ యుద్ధ విమానాలు ఒక పెద్ద స్కాం అన్న రాహుల్ ఈ కుంభకోణంలో అనిల్ అంబానీ కోసం మోదీ వేల కోట్లు దాచి పెట్టారని వెల్లడించారు. ఫ్రాన్స్ ప్రధాని పర్యటన డెలిగేషన్ లో ఆయన స్నేహితుడు అనిల్ అంబానీ వెళతారు.

ఫ్రాన్స్ రాఫెల్ ధరను దాచిపెట్టాల్సిన అవసరం లేదని చెప్పినా మోదీ ఎందుకు దాస్తున్నారు? రాఫెల్ ఒప్పందం బయట పెట్టడం కుదరదని, అది రక్షణ వ్యవహారమని హోమ్ మినిస్టర్ అంటారు. దేశ యుద్ధ విమానాల కొనుగోలు గురించి దేశ ప్రజలకు తెలియటం రక్షణ వ్యవహారం ఏంటి. దీని గురించి తెలుసుకునే హక్కు దేశ పౌరులకు లేదా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయమే పార్లమెంటులో నేను కన్ను కొట్టి ప్రశ్నిస్తే నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకపోయారు మోదీ అని రాహుల్ తెలిపారు. తప్పు చేసినవారే ప్రశ్నించేవారి కళ్ళలోకి సూటిగా చూడలేరని రాహుల్ వ్యక్తం చేశారు.

ఇక కేసీఆర్ పాలన గురించి మాట్లాడుతూ అవినీతికి తెలంగాణ రాజధానిగా మారిందన్నారు. దళితులకు మూడెకరాలు ఇస్తామని ఒక్కరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. లక్షన్నర ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ కనీసం పదివేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని వెల్లడించారు. నాలుగేళ్ల కేసీఆర్ పాలనలో నాలుగు వేలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పులమయం చేశారన్నారు.

తెలంగాణ, ఏపీలకు విభజన హామీలు సమన్యాయంతో ఇచ్చాము అని తెలిపారు రాహుల్. ఏపీకి ప్రత్యేకహోదా ప్రతిపాదన చేసింది కాంగ్రెస్ అని ఆ మాటకి ఇప్పటికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. మోదీ సర్కార్ విభజన హామీలు అమలు చేసినా చేయకపోయినా అవి నెరవేర్చటానికి మేము ఎప్పుడూ సిద్ధమే అన్నారు. మోదీ, కేసీఆర్ మీడియాని అణిచివేస్తున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీడియాకి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని తెలియజేసారు.

దేశవ్యాప్తంగా మోదీ రైతుల కోసం MSP 10 వేల కోట్లు ఇస్తే ఒక్క కర్ణాటకలోనే కాంగ్రెస్ సర్కార్ 31 వేల కోట్లతో రుణమాఫీ చేసినట్టు గుర్తు చేశారు. మోదీలాగా తప్పుడు హామీలు ఇవ్వటానికి నేను రాలేదని తెలిపారు. నోట్ల రద్దుతో సంపన్నులకు తప్ప పేదవారికి ప్రయోజనం కలగలేదని అన్నారు. సంపన్నుల అప్పులు మాఫీ చేసేందుకే నోట్ల రద్దు, జీఎస్టీ అమలు అన్నారు. సూటు బూటువేసుకుంటేనే రుణ మాఫీ చేయటం మోదీ లక్షణమని ఎద్దేవా చేశారు.

గబ్బర్ సింగ్ టాక్స్ (జీఎస్టీ) లక్ష్యం పేదల నుండి, రైతులనుండి దోచిన ధనం సంపన్నులకు దోచిపెట్టడానికే అన్నారు రాహుల్. బేటీ బచావో బేటీ పడావో అనే బీజేపీ నేతలు మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతుంటే పట్టించుకోరని వ్యక్తం చేశారు. ఎవరైతే క్షేత్ర స్థాయిలో పార్టీ కోసం పోరాడతారో వారికే ప్రజా ప్రతినిధులుగా టిక్కెట్లు ఇస్తానని తెలిపారు. పార్టీలో ప్యారాచూట్ లీడర్ల సంగతి నేను చూసుకుంటా. పార్టీ కోసం పని చేసేవారని గుర్తించి వారికి పార్టీలో తగిన స్థానం కల్పిస్తామని స్పష్టం చేశారు.