అప్పులు ఎగ్గొట్టడానికి మాష్టర్ ప్లాన్.. పోలిసుల ఎంట్రీ తో ప్లాన్ రివర్స్…?

సాధారణంగా చాలామంది ఆర్థిక సమస్యల వల్ల ఇతరుల వద్ద అప్పు చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది తీసుకున్న అప్పులు సక్రమంగా చెల్లిస్తే మరి కొంతమంది మాత్రం ఆపదలో సహాయం చేసిన వారికి పెట్టి ఊరు వదిలి పారిపోతున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. వ్యాపారాన్ని విస్తరింప చేయటం కోసం జమ్మూ కాశ్మీర్లోని వివిధ బ్యాంకులు ప్రైవేట్ వ్యక్తుల వద్ద దాదాపు 30 లక్షల రూపాయలు అప్పు చేసిన వ్యక్తి వాటిని తిరిగి చెల్లించకుండా ఉండేందుకు ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. అయితే పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో ఆ ప్లాన్ కాస్త రివర్స్ అయ్యి కుటుంబం మొత్తం కటకటాలు పాలయ్యారు.

వివరాలలోకి వెళితే…జమ్మూకశ్మీర్‌లోని డోడాకు చెందిన మనజీత్‌సింగ్‌ (31) అనే వ్యక్తి వ్యాపార నిమిత్తం ప్రైవేటు వ్యక్తుల వద్ద బ్యాంకుల నుండి దాదాపు 30 లక్షల రూపాయలు అప్పు చేశాడు. అయితే వ్యాపారంలో నష్టాలు రావడంతో తీసుకున్న అప్పులు చెల్లించలేక వాటిని ఎగ్గొట్టేందుకు పక్కా ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో మనజీత్ సింగ్ అతడి భార్య, ఆరేళ్ల కుమార్తెను తీసుకొని డిసెంబర్‌ 20న రాత్రి కి రాత్రే అదృశ్యమయ్యారు. అయితే అదే సమయంలో వీరికి చెందిన కారు చినాబ్‌ నదిలో పడి ఉండటం తో పాటు మనజీత్‌సింగ్‌ గుర్తింపు కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్సును నది ఒడ్డున పోలీసులు గుర్తించారు. దీంతో రోడ్డుప్రమాదంలో అతడి కుటుంబం మృతిచెందిందని స్థానికులు భావించారు.

అయితే.. మృతదేహాల కోసం గాలించినా కూడా వారి ఆనవాలు కనిపించకపోవడంతో పాటు, లగేజి వంటివి కూడా దొరక్కపోవడంతో పోలీసులకుఅనుమానం వచ్చి మరో కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీసులకు మనజీత్ సింగ్ అప్పుల గురించి తెలిసింది. దీంతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి మనజీత్ సింగ్ కుటుంబ సభ్యులను వెతకటం కోసం పోలీసులు రంగంలోకి దిగారు.ఈ క్రమంలో హరియాణా పోలీసుల సాయంతో పంచకుల సమీపంలోని అభయ్‌పుర గ్రామంలో మనజీత్‌సింగ్‌ కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో మనజీత్ సింగ్ ని ప్రశ్నించగా అసలు విషయం బయట పెట్టాడు. అప్పులు తిరిగి చెల్లించలేక చనిపోయినట్లు నాటకం ఆడటం కోసం అలా కారుని నది ఒడ్డున వదిలేసి వారు ఎవరికీ కనిపించకుండా మాయమైనట్లు వివరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని వారిని రిమాండ్ కి తరలించారు.