సరిహద్దుల్లో 300 మంది ఉగ్రవాదులు సిద్దంగా ఉన్నారట 

భారత్, పాక్ సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి.  నియంత్రణ రేఖను దాటి ఇండియాలోకి చొరబడటానికి 250 నుండి 300 మంది ఉగ్రవాదులు సిద్దంగా ఉన్నారట.  ఉత్తర కశ్మీర్‌లోని నౌగామ్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖను దాటేందుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన అనంతరం మేజర్ జనరల్ వీరేంద్ర వత్స్ మీడియాతో మాట్లాడుతూ సరిహద్దుల వెంబడి పాక్ లాంచ్ ప్యాడ్లు నిండిపోయాయని, ఉగ్రవాదులు దేశంలోకి చొరబడటానికి సిద్దంగా ఉన్నారని, భారత సైన్యం అన్ని విధాలా అప్రమత్తంగా ఉందని అన్నారు. 
 
నిఘా వర్గాలు సైతం పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ దాడులకు తెగబడే అవకాశం ఉందని హెచ్చరించాయి.  పాక్ నేరుగా ఉగ్రవాదులకు సహకరిస్తూ వారిని ఇండియాలోకి పంపేందుకు యత్నిస్తుండటంతో భద్రతా దళాలు సరిహద్దు రేఖ వెంబడి మెరుపు దాడులు జరుపుతోంది.  నౌగామ్ సెక్టార్లో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.  ఈ ప్రాంతంలో దాగి ఉన్న ఉగ్రవాదుల కోసం దళాలు గాలింపు చర్యలు జరుపుతున్నాయి. 
 
జమ్మూ కాశ్మీర్లో భద్రతా దళాలు ఆపరేషన్ ఆలౌట్ ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి.  అన్ని వర్గాల ఉగ్రవాదులను ఏరివేయడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశ్యం.  ఈ ఆపరేషన్ మూలంగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద తాకిడి చాలావరకు తగ్గింది.  ఏరివేత కార్యక్రమంతో పాటు ఉగ్రవాదుల కార్యకలాపాలకు అక్రమ మార్గాల ద్వారా వెళ్ళే నిధులకు కూడా అడ్డుకట్ట పడింది.  దీంతో లోయలో ప్రశాంత వాతావరణం నెలకొంది.  దీన్ని ఎలాగైనా చెడగోట్టాలనే ఉద్దేశ్యంతో పాక్ ఉగ్రవాద సంస్థలు ఇండియాలోకి చొరబాటు ప్రయత్నాలు చేస్తుండగా పాక్ వారికి సహకరిస్తోంది.