కర్ణాటకలోని తుమ్కురు సిద్ధగంగా మఠాధిపతి శివ కుమార స్వామిజీ (111) శివైక్యం చెందారు. లింగాయత్ వీరశైవులు తమ ఆరాధ్య దైవంగా పూజించే శివ కుమార స్వామి అనారోగ్యంతో మరణించారు. ఊపిరితిత్తుల వ్యాధితో శివకుమార స్వామిజి గత కొంత కాలంగా బాధపడుతున్నారు. డిసెంబర్ 8న వైద్యులు ఆయనకు ఆపరేషన్ చేశారు. అయినా శివకుమార స్వామిజీ ఆరోగ్యం కుదుట పడలేదు. గత 15 రోజుల నుంచి కూడా ఆయన హెల్త్ బులెటిన్ విషయంలో వైద్యులు గోప్యత పాటించారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు.
విషయం తెలియగానే ముఖ్యమంత్రి సిద్దరామయ్య వెంటనే అక్కడకు చేరుకొని ఆయనకు సంతాపం తెలిపారు. అల్లర్లు చెలరేగకుండా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. మంగళవారం శివకుమార స్వామిజీ అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. స్వామిజీ మృతికి సంతాప సూచకంగా మంగళవారం సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది.
నడిచే దేవుడిగా ప్రసిద్ధిగాంచిన శివకుమారస్వామిజీ అనేక దాతృత్వ కార్యక్రమాలు చేపట్టారు. శ్రీ సిద్ధగంగా ఎడ్యూకేషన్ సొసైటీ పేరిట 125 విద్యాసంస్థలను నెలకొల్పి పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. ఈ సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2015లో స్వామిజీకి పద్మభూషణ్ అవార్డును అందజేసింది.
ఇక ఉదయం స్వామిజీ ఆరోగ్యం విషమించిందని అధికారులు ప్రకటించడంతో మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్ప, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి జి పరమేశ్వరలు తమ కార్యక్రమాలను రద్దు చేసుకొని మరి మఠానికి వచ్చారు.