బలహీన నటనతో కాలం వెళ్ళదీస్తున్న శ్రీవిష్ణుకి ఇక నటన తెలిసి వచ్చినట్టుంది – విరగదీసి నటిస్తూ వచ్చేశాడు, వెంట ఇద్దరు కమెడియన్లని వేసుకుని. శ్రీవిష్ణు తో ‘మెంటల్ మది’లో తీసిన కొత్త దర్శకుడు వివేక్ ఆత్రేయ వెంటనే పూర్తిస్థాయి కామెడీతో రెండో ప్రయత్నం చేశాడు. వీళ్ళిద్దరూ ఈసారి ఎలా ప్రూవ్ చేసుకున్నారో ఓసారి కింద చూద్దాం…
కథ
రాహుల్ (శ్రీ విష్ణు), రాకీ (ప్రియదర్శి), రాంబో (రాహుల్ రామకృష్ణ) లనే ఆర్ త్రీ త్రయం ఒక టౌన్లో జ్యూనియర్ కాలేజీలో ఐదేళ్లుగా ఇంటర్ చదువుతున్న విద్యార్ధులు. ఆవారాగా తిరుగుతూంటారు. అదే కాలేజీలో ప్రిన్సిపాల్ కూతురు మిత్ర (నివేదా థామన్) చేరుతుంది. నల్గురూ ఫ్రెండ్స్ అవుతారు. ఈమెకి కూడా చదువుపట్ల శ్రద్ధ వుండదు, నాట్యం మీద ఆసక్తి వుంటుంది. కానీ తండ్రి నిర్బంధంగా చదివిస్తూంటాడు, తట్టుకోలేక ఇంట్లోంచి వెళ్లి పోవాలనుకుంటుంది. అందుకు కావాల్సిన డబ్బుకోసం కిడ్నాప్ ప్లానేస్తారు నల్గురూ. ఆమెని కిడ్నాప్ చేసి, తండ్రి దగ్గర్నుంచి ఎనిమిది లక్షలు రాబట్టి వదిలేస్తారు ఆర్ త్రీ. రెండ్రోజులు పోయాక ఆ డబ్బుతో హైదరాబాద్ చేరుకుంటుంది మిత్రా. ఆర్ త్రీ కూడా హైదరాబాద్ చేరుకునేసరికి ఆమెని రియల్ గ్యాంగ్ రియల్ కిడ్నాప్ చేసి పది లక్షలు డిమాండ్ చేస్తుంది.
మరో వైపు విశాల్ (సత్యదేవ్) అనే ఔత్సాహిక దర్శకుడు షాలిని (నివేదా పేతురాజ్) అనే హీరోయిన్ కి కథ విన్పిస్తూంటాడు. వీళ్ళిద్దరికీ అనుకోని ప్రమాదం జరిగి ఎనిమిది లక్షలు పోగొట్టుకుంటారు. వీళ్ళకీ ఆర్ త్రీకీ సంబంధమేమిటి? తమ కిడ్నాప్ డ్రామా రియల్ కిడ్నాప్ గా మారిన ఈ పరిస్థితుల్లో ఆర్ త్రీ ఏం చేశారు? మిత్రని ఎలా కాపాడుకున్నారు? నిజాలు తెలుసుకున్న మిత్ర తండ్రి ఏం చేశాడు?…ఇదీ మిగతా కథ.
ఎలావుంది కథ
కామెడీ థ్రిల్లర్. నవ్వించడమే టార్గెట్. కానీ సెకండాఫ్ లో సీరియస్ అవుతుంది. జరిగే కీలక సంఘటనలకి లాజిక్ వుండదు. ముగింపులో కొన్ని ప్రశ్నలుండి పోతాయి. కథ హైదరాబాద్ చేరుకున్నాక రెండు ట్రాకుల కథగా మారడంతో మంచి ఆసక్తి రేగుతుంది. వీలయినంత సస్పెన్స్ వుంది. ముఖ్యంగా ఇంటర్వెల్లో ట్విస్ట్ క్లిష్టంగా వుంటుంది. అక్కడే సత్య దేవ్, నివేదా పెతురాజ్ ల ట్రాకు కలవడంతో. ఈ ట్విస్టు ఎలా వీడుతుందనే ప్రశ్నే సెకండాఫ్ ని సస్పెన్సు తో నడిపిస్తుంది. మార్కెట్ యాస్పెక్ట్ దీనికి కరెక్ట్ గా కుదిరింది. ఎకనామిక్స్ ఆథారంగా నడిచే ఈ కథ చాలా లైటర్ వీన్ సెమీ కామెడీ గా వుండడం యూత్ అప్పీల్ కి తోడ్పడింది. ఇందులో రోమాంటిక్స్ లేదు. ఆ లోటు కూడా కనపడదు. బరువైన పాయింటుతో వుండే సినిమాలకి కథనం తేలికగా వుంటుంది. తేలికైన పాయింటుతో వుండే ఇలాటి సినిమాలకి కథనం కాంప్లికేట్ అవడమే బలం. హిందీలో ‘హేపీ భాగ్ జాయేగీ’ అనే హిట్ ఇలాంటిదే.
ఎవరెలా చేశారు
శ్రీ విష్ణు గత అన్ని సినిమాలకంటే ఇంప్రూవ్ అయ్యాడు. ఫేసులో నీరసం తగ్గి ఫ్రెష్ గా, యాక్టివ్ గా వున్నాడు. నవ్విస్తూ కామెడీ పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. కాకపోతే ఇంకా జ్యూనియర్ ఇంటర్ స్టూడెంట్ అంటే నమ్మశక్యంగా లేడు.
హీరోయిన్ నివేదా థామస్ కూడా ఇంటర్ స్టూడెంట్ లా అన్పించదు. నాట్యాన్ని జీవితాశయంగా పెట్టుకున్న అమ్మాయిగా, తండ్రితో మౌన సంఘర్షణని బాగానే పోషించింది. నవ్వుతూ కన్పించే దృశ్యాలు చాలా తక్కువ. రెండో హీరోయిన్ నివేదా పేతురాజ్ ఎందుకో వయసుకి మించిన గాంభీర్యంతో వుంటుంది. జోవియల్ గా వుండాల్సింది. ఈ కామెడీలో హీరోయిన్ లిద్దర్లో ఒకరైనా సరదాగా లేకపోవడం ఒక వింత. ఇక ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల కామెడీలు ఓకే. నేరస్థులకి లాభించే వింత లాజిక్కులు చెప్పి వదిలేసే పోలీస్ ఇన్స్ పెక్టర్ గా సత్య కృష్ణది గమ్మత్తైన క్యారెక్టర్. స్ట్రగుల్ చేస్తున్న కాబోయే డైరెక్టర్ గా సత్యదేవ్ ఎక్సెలెంట్.
టెక్నికల్ విలువలు బావున్నాయి. వివేక్ సాగర్ సంగీతం ఫ్యూజన్ మ్యూజిక్ తో మంచి మూడ్ ని క్రియేట్ చేస్తూ పోతుంది. హీరోయిన్ నాట్యం అనే కాన్సెప్ట్ వుండడం వల్ల సంగీతం ఆ శైలిలో సాగింది. సాయిశ్రీ రాం ఛాయాగ్రహణం టౌన్లో ఎంత బావుందో, హైదరాబాద్ లో అంత బావుంది.
చివరికేమిటి
మొదటి సినిమా ‘మెంటల్ మదిలో’ పూర్ గా తీసిన దర్శకుడు వివేక్ ఆత్రేయ, రెండో దాంతో ఒక ఆశ్చర్యపర్చే ఎంట్రీ ఇచ్చాడు. యూత్ ఫుల్ కథతో, యూత్ ఫుల్ డైరెక్షన్ తో, యూత్ ఫుల్ రైటింగ్ తో. ఒక ఔత్సాహిక దర్శకుడు హీరోయిన్ కి చెప్తున్నకథ, సినిమాలో జరుగుతున్న కథతో స్పర్శించడమనే కొత్త ఐడియాతో. ఇందుకు తారాగణం ఎంపిక కథాలోకంలో ఇమిడి పోయేట్టు.
నాట్యం మీద ఆసక్తి వున్న అమ్మయిని రహస్యంగా వూరు దాటించే ప్రయత్నం ఎన్ని మలుపులకి దారితీసిందో ఫస్టాఫ్ అంతా కామెడీగా చెప్పి, సెకండాఫ్ లో కథ ప్రకారం సీరియస్ గా చేశాడు. ఇది రోమాంటిక్ కామెడీ కాదు, రోమాన్స్ కోసం ఇందులో ఏమీ జరగదు. కానీ రోమాంటిక్ కామెడీల జానర్ మర్యాదల్ని పాటించాడు. రోమాంటిక్ కామెడీల్లో యువపాత్రలు ఏవో ప్రయోగాలతో వాటికవే సమస్యలు సృష్టించుకుని, వాటికవే బయటపడి మంచి చెడులు తెలుసుకుంటాయి. పెద్ద పాత్రల చేత క్లాసులు పీకించుకుని పరిష్కారాలు వాటి చేతిలో పెట్టవు. పెద్ద వయసు పాత్రల్ని కంగారు పెట్టేస్తాయి. యువత స్వావలంబన సాధించాలనే దృష్టితో రోమాంటిక్ కామెడీలుంటాయి.
ఇందులో కూడా కిడ్నాప్ అనే ప్రయోగంతో యువపాత్రలు చేసిందిదే. ఐతే సెకండాఫ్ లో కూతురితో ఎలా వుండాలో ఇన్స్ పెక్టర్, హీరోయిన్ తండ్రికి చెప్పాక మార్పు వచ్చినట్టు కనపడతాడు తండ్రి. కానీ ముగింపులో మళ్ళీ మొదటి పరిస్థితే వుంటుంది. కూతురి నాట్యాభిలాష తెలుసుకున్నట్టు ముగింపు వుండదు. మళ్ళీ ఆమె అదే ఇంటర్ కాలేజీకి వెళ్తూంటుంది. అంటే ఇక లెంపలేసుకుని, నాట్యం ఆలోచన మానుకుని బుద్ధిగా చదువు కుంటున్నట్టా?
రియల్ కిడ్నాప్ ఎపిసోడ్ లో హీరోయిన్ దగ్గర ఎనిమిది లక్షలున్న బ్యాగున్నప్పుడు, అదిచ్చేసి బయటపడొచ్చు. కిడ్నాపర్ డిమాండ్ చేసిన పది లక్షలకోసం హీరో ఇంకో నేరం చేయనవసరంలేదు. ఆ నేరం డబ్బుకోసం ఒక సినిమా హీరోయిన్ కీ, కాబోయే దర్శకుడికీ ప్రమాదం జరిపించి హీరోయిన్ ని ప్రాణాపాయ స్థితికి నెట్టేసినప్పుడు, హీరో ఫ్రెండ్స్ తో తిరిగి వూరికొచ్చేసి కాలేజీ కెళ్ళే ముగింపు సందేహాతీతంగా లేదు. వాళ్ళు క్రిమినల్సే. హైదరాబాద్ లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏం చేస్తున్నట్టు?
రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
తారాగణం : శ్రీవిష్ణు, నివేదా థామస్, నివేదా పేతురాజ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ సత్యదేవ్, శివాజీరాజా తదితరులు
సంగీతం: వివేక్ సాగర్, ఛాయాగ్రహణం : సాయి శ్రీరాం
బ్యానర్: మన్యం ప్రొడక్షన్స్
నిర్మాత: విజయ్ కుమార్ మన్యం
విడుదల: జూన్ 28, 2019
3 / 5
―సికిందర్