Migraine Relief: రోజూ తలనొప్పితో బాధపడుతున్నారా.. నిద్రకు ముందు ఈ పని చేయండి..!

నిత్యం తలనొప్పి.. అకస్మాత్తుగా మైగ్రేన్ దాడి.. ఒత్తిడితో తల బరువెక్కి పని చేయలేకపోవడం.. ఈ సమస్యలు నేటి యువత నుంచి వృద్ధుల వరకూ అందరినీ వేధిస్తున్నాయి. రోజూ పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల తాత్కాలిక ఉపశమనం లభిస్తున్నా, దీర్ఘకాలంలో వాటి దుష్ప్రభావాలు మరింత పెరుగుతున్నాయని వైద్యులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో ఆయుర్వేదం నుంచి వచ్చిన ఒక సహజ పరిష్కారం ఇప్పుడు ప్రజల్లో ఆసక్తిని పెంచుతోంది. అదే తులసి తైలం.

సంప్రదాయంగా ఇళ్లలో పూజించే తులసి, కేవలం ఆధ్యాత్మిక శక్తికే కాదు – ఆరోగ్య పరంగా కూడా ఓ శక్తివంతమైన ఔషధ మొక్కగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా మెదడు సంబంధిత సమస్యలు, నరాల ఒత్తిడి, మైగ్రేన్ వంటి సమస్యల్లో తులసి తైలం అద్భుతమైన ఉపశమనాన్ని ఇస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో సహజంగా ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ స్ట్రెస్ గుణాలు నరాల్లో ఏర్పడే వాపును, బ్లాకేజీలను తగ్గించడంలో కీలకంగా పని చేస్తాయని పరిశీలనలు చెబుతున్నాయి.

తులసిని ఆయుర్వేదంలో ‘మస్తిష్క వర్ధినీ’గా పేర్కొంటారు. అంటే ఇది మెదడును బలపరచి, ప్రశాంతతను పెంచే గుణం కలిగి ఉంటుంది. తులసి తైలంలోని సువాసన, వేడి చేసే స్వభావం కలిసి మెదడుకు వెళ్లే రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీని వల్ల తల బరువుగా ఉండటం, నరాల్లో గట్టితనం, ఒత్తిడి కారణంగా వచ్చే నొప్పి వేగంగా తగ్గుతుంది. మైగ్రేన్ ట్రిగ్గర్‌లు కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయని వైద్యులు చెబుతున్నారు.

ఈ తైలాన్ని ఉపయోగించే పద్ధతి చాలా సులభమే. నిద్రపోయే ముందు కొద్దిగా తులసి తైలాన్ని వెచ్చగా చేయాలి. తరువాత ముక్కు రంధ్రాల్లో ఒక్కోటి లేదా రెండు చుక్కలు మాత్రమే వేయాలి. ఆ తర్వాత ఒకటి రెండు నిమిషాల పాటు లోతుగా ఊపిరి తీసుకుంటూ రిలాక్స్ అవ్వాలి. కొద్ది నిమిషాల్లోనే తల తేలికగా మారుతున్న ఫీలింగ్ వస్తుంది. చాలా మందికి వెంటనే నొప్పి తగ్గిన అనుభూతి కలుగుతుందని చెబుతున్నారు. ఈ విధానాన్ని 10 నుంచి 15 రోజులు నిరంతరంగా పాటిస్తే, సంవత్సరాలుగా వెంటాడుతున్న తలనొప్పి కూడా తగ్గడం ప్రారంభమవుతుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ తులసి తైలాన్ని మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. తాజా తులసి ఆకులను శుభ్రంగా కడిగి నీటి తేమ లేకుండా బాగా ఆరబెట్టాలి. ఆ తర్వాత వాటిని కొద్దిగా నలిపి, కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెలో వేసి తక్కువ మంటపై 10 నుంచి 15 నిమిషాలు మరిగించాలి. తులసి ఆకులలోని శక్తివంతమైన గుణాలు పూర్తిగా నూనెలో కలిసే వరకు మరిగించాక చల్లారనివ్వాలి. ఆ నూనెను వడకట్టి గాజు సీసాలో నిల్వ చేసుకుంటే చాలాకాలం ఉపయోగించుకోవచ్చు.

మైగ్రేన్ మాత్రమే కాదు.. ఈ తులసి తైలం జలుబు, ముక్కు బ్లాకేజ్, నిద్రలేమి, మానసిక ఆందోళన, మెడ నొప్పి, భుజాల స్టిఫ్‌నెస్ వంటి సమస్యలకూ కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. అయితే తీవ్రమైన నొప్పులు, దీర్ఘకాలిక నరాల వ్యాధులు ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా వైద్యుల సూచన తీసుకున్న తర్వాతే ఈ విధానాన్ని పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆధునిక జీవనశైలితో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, నిద్రలేమి, స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల తలనొప్పి ఇప్పుడు ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో రోజూ మందులపై ఆధారపడకుండా, సహజంగా ఉపశమనం కలిగించే తులసి తైలంలాంటి ఆయుర్వేద చికిత్సలు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.