ముగ్గురు హీరోయిన్లతో రామ్ చరణ్ రొమాన్స్.!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎట్టకేలకు ‘గేమ్ ఛేంజర్’ సినిమా వ్యవహారాల నుంచి, కొత్త సినిమా వ్యవహారాల్లోకి మారబోతున్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోయినట్లే. చిన్నా చితకా ప్యాచ్ వర్క్ ఏమైనా వుంటే వుండొచ్చుగాక.

ఇంకోపక్క, బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. ఈ సినిమాకి సంబంధించి నటీనటుల ఎంపిక తదితర వ్యవహారాలు శరవేగంగా జరుగుతున్నాయి. హీరోయిన్‌గా జాన్వీ కపూర్ పేరు ఇప్పటికే ఖాయమైన సంగతి తెలిసిందే.

అదే సమయంలో, బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తదానీతో స్క్రీన్ టెస్ట్ గతంలో చేసింది చిత్ర యూనిట్. ఆమె ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించవచ్చునట. మరో హీరోయిన్‌కి కూడా ఈ సినిమాలో ఛాన్స్ వుందని అంటున్నారు.

ముగ్గురు హీరోయిన్లా.? అంటే, జాన్వీ కపూర్ మాత్రమే సోలో హీరోయిన్ అనీ, మరో ఇద్దరు భామలు కీలక పాత్రల్లో కనిపిస్తారనీ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై చిత్ర యూనిట్ స్పష్టతనివ్వాల్సి వుంది.

‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు సన, రామ్ చరణ్‌తో సినిమా కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కూడా ‘గేమ్ ఛేంజర్’ సినిమాకి లాక్ అయిపోయాడు దాదాపు మూడేళ్ళపాటు.

‘గేమ ఛేంజర్’ సినిమాలో రామ్ చరణ్ సరసన కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. రామ్ చరణ్ – కైరా అద్వానీ గతంలో ‘వినయ విధేయ రామ’ సినిమాలో కలిసి నటించారు.