కల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి కొందరు ప్రముఖుల పాలిట శాపంగా మారింది. ఆరోగ్యంగా ఉన్న వారిని ఆసుపత్రిలో చేర్చి ఇటు అభిమానులు, అటు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిలిస్తుంది. ఇప్పటికే కరోనాతో చాలా మంది సెలబ్రిటీలు తిరిగి రాని లోకాలకు వెళ్ళారు. ఇందులో పలువురు సింగర్స్, నటులు, దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో మృతి చెందడం సంగీత ప్రపంచాన్ని శోక సంద్రంలో పడేసింది.
ఒకప్పుడు యాక్షన్ చిత్రాలతో అభిమానులని ఎంతగానో అలరించిన రాజశేఖర్ కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న రాజశేఖర్ ఆరోగ్యం కొంత కుదుటపడినట్టు తెలుస్తుంది. కొద్ది సేపటి క్రితం సిటీ న్యూరో ఆసుపత్రి రాజశేఖర్ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులిటెన్ విడుదల చేయగా, ఇందులో ఆయన ఆరోగ్యం కుదుటపడిందని పేర్కొంది. వైద్యానికి రాజశేఖర్ స్పందిస్తున్నారు. క్లినికల్ టీం ప్రత్యేక పర్యవేక్షణలో ఆయనకు చికిత్స నడుస్తుందని పేర్కొన్నారు.
జీవిత రాజశేఖర్ కూడా కరోనా బారిన పడగా, ఆమెకు కూడా సినీ న్యూరో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే తాజాగా జరిపిన పరీక్షలో జీవితకు నెగెటివ్‌గా నిర్ధారణ కాగా, ఆమెను ఈ రోజు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయనున్నాం అని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. రాజశేఖర్ కూతుళ్ళు శివానీ, శివాత్మికలకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, వారు త్వరగానే కోలుకున్నారు.
రాజశేఖర్ ఫ్యామిలీ అంతా కరోనా బారిన పడడం అభిమానులని ఎంతగానో కలవరపరచింది. శివాత్మిక తన తండ్రి ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుతూ ట్వీట్ చేయడంతో అనేక పుకార్లు షికారు చేశాయి. చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా శివాత్మికకు ధైర్యం చెప్పారు. నా స్నేహితుడు త్వరగానో కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.