China Virus: చైనాలో కొత్త వైరస్.. వైరస్ లన్నీఇక్కడే ఎందుకు పుడతాయి.. కారణం ఇదే..!

ప్రపంచాన్ని వణికించిన అనేక మహమ్మారులకు చైనా కేంద్రబిందువుగా మారిందంటే.. అది కేవలం యాదృచ్ఛికం కాదు. 1956లో ఏషియన్ ఫ్లూ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 లక్షల మందిని బలితీసుకోగా, 2002లో సార్స్, 2013లో H7N9, 2020లో కోవిడ్-19 రూపంలో మానవాళిపై విపరీతమైన ప్రభావం చూపింది. ఇప్పుడు తాజాగా మెటాప్ న్యూమోవైరస్ అనే మరో వైరస్ చైనాలోనే బయటపడిందన్న వార్త ప్రపంచాన్ని మళ్లీ ఆందోళనకు గురిచేస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మహమ్మారులన్నిటికీ చైనానే పుట్టినిల్లు.. దీని వెనక గల కారణాల్ని పరిశీలిస్తే, నిజంగా భయంకరమైన వాస్తవాలు బయటపడుతున్నాయి.

చైనాలో జనాభా అత్యధికంగా ఉండటం వల్ల అక్కడ వ్యాధుల వ్యాప్తి వేగంగా జరుగుతుంది. ప్రత్యేకించి నగరాల్లో జనసాంద్రత అత్యంత అధికంగా ఉండడం, ప్రజలు దగ్గరగా ఉండాల్సిన పరిస్థితి, ఇలాంటి వైరస్‌లకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తోంది. ఒకరికి సోకిన వైరస్ అతి తక్కువ సమయంలోనే ఇతరులకు వ్యాపించే పరిస్థితి ఏర్పడుతోంది. అంతేకాకుండా, ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా చైనా మారడంతో ఎన్నో బహుళజాతి కంపెనీలు అక్కడే తమ పరిశ్రమలు స్థాపించాయి. దీంతో అక్కడి నుంచి ప్రపంచదేశాలకు వస్తువులు, సరకులు మాత్రమే కాదు… వ్యాధులు కూడా ప్రయాణించే మార్గాలు సులభమయ్యాయి. అంతర్జాతీయ వాణిజ్యం, ప్రయాణాల వల్ల వైరస్‌లు సరిహద్దులు దాటి విస్తరిస్తున్నాయి.

దీనికితోడు చైనాలో వన్యప్రాణుల మాంసాన్ని తినే సంస్కృతి కొనసాగుతోంది. గబ్బిలాలు, పందులు, బల్లులు, పాములు వంటి అనేక వన్యజంతువులను అక్కడి ప్రజలు ఆహారంగా వినియోగిస్తున్నారు. వీటి రక్తం, శ్వాసనాళాల ద్వారా వచ్చే వైరస్‌లు మానవుల్లోకి ప్రవేశించి జన్యుపరమైన మార్పులకు గురై మానవజాతికి ముప్పుగా మారుతున్నాయి. మాంసాహార మార్కెట్లు అనేక రకాల జంతువులతో నిండిపోవడం, వాటిని తాకే లేదా వధించే సమయంలో జాగ్రత్తలేమి ఇవన్నీ కొత్త కొత్త వైరస్‌లకు ఆవాసాలుగా మారుతున్నాయి. కోవిడ్-19 విషయంలో ఇదే జరిగినట్లు పరిశోధనలు చెబుతున్నాయి.

ఇంకా చైనాలో పశుపోషణ ఎక్కువగా జరిగే అంశాన్ని కూడా విస్మరించలేము. కోళ్లు, బాతులు, పందుల వంటి జంతువులను పెద్ద సంఖ్యలో ఫార్ముల్లో పెంచుతారు. కానీ అవి వ్యాధులను కలిగించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. ఫార్ముల్లో ఉన్న జంతువులు సులభంగా వైరస్ బారిన పడే పరిస్థితి, వాటిని మాంసాహార మార్కెట్లకు తీసుకెళ్లినప్పుడు వేరే జంతువుల నుంచి మరింత ప్రమాదకరమైన వైరస్‌లను పొంది, తిరిగి మందలకు చేరినపుడు ఇతర జంతువులకు వ్యాపించే ప్రమాదం పెరుగుతోంది. చివరకు ఇది మానవులకు చేరి, ప్రపంచాన్ని ఓ కొత్త మహమ్మారి వెంటాడే స్థితికి తీసుకెళ్తోంది.

ఏదైనా కొత్త వ్యాధి లక్షణాలు కనిపించినా చైనాలో వాటిని తొలుత దాచిపెడుతుంది.. ప్రభుత్వ స్థాయిలో చర్యల్లో ఆలస్యం, సమర్థవంతమైన నివారణ చర్యలు చేపట్టకపోవడం.. ఇవి అన్నీ ప్రపంచవ్యాప్తంగా వ్యాధి విస్తరణకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రతి కొత్త వైరస్ వార్త వెలుగులోకి వచ్చినప్పుడు చైనా పేరు ముందుగా వినిపించడం యాదృచ్ఛికం కాదు. ఇది ప్రపంచానికి హెచ్చరిక. మన జీవనశైలిలో మార్పు రాకపోతే, ఇదే క్రమం కొనసాగుతుంది. నేడు మెటాప్ న్యూమోవైరస్… రేపు ఇంకేదైనా కొత్త పేరు. కానీ ఆ వైరస్ పుట్టినిల్లు మాత్రం మారదు.. అదే చైనా.