New Viruses: వామ్మో.. చైనా గబ్బిలాల్లో ప్రాణాంతక 20 వైరస్ లు.. కోవిడ్ కంటే ప్రమాదకరం..!

చైనాలోని గబ్బిలాల్లో భయానక వాస్తవం వెలుగులోకి వచ్చింది. యునాన్ ప్రావిన్స్‌లో శాస్త్రవేత్తలు ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో 20 కొత్త వైరస్‌లు గుర్తించారు. వీటిలో రెండింటి ప్రభావం మరింత ఆందోళన కలిగిస్తోంది. అవి మానవజాతిని అతలాకుతలం చేసిన కోవిడ్ కన్నా ప్రమాదకరమై ఉండే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2017 నుంచి 2021 మధ్య 142 గబ్బిలాల నుంచి సేకరించిన కిడ్నీల నమూనాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. జన్యుపరిశోధనల ద్వారా ఈ కొత్త వైరస్‌ల జాడలు కనిపెట్టారు. ఇవి మామూలు వైరస్‌లు కావు, ఇప్పటికే ప్రపంచాన్ని నిపా, హెండ్రా వైరస్‌లు వణికిస్తున్నాయి.

ఈ కొత్త వైరస్‌లు “హేనిపావైరస్” కేటగిరీలోకి వస్తాయి. మానవులకు తీవ్రంగా సోకే సామర్థ్యం వీటిలో ఉంది. ఇవి ముఖ్యంగా గబ్బిలాల కిడ్నీలో కనిపించడం వల్ల వాటి ద్వారా విసర్జించే మూత్రం పండ్లు, నీటిని కలుషితం చేయవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో గబ్బిలాలు పంటల పొలాల్లోనూ, పండ్ల తోటల వద్దనూ తిరుగుతుంటాయి. ఈ సమయంలో పండ్లపై మూత్రం పడితే వాటిని తినే మనుషులు, పశువులకు ఈ వైరస్ సోకే ప్రమాదం ఉంది. ఇదే పెద్ద ప్రమాదానికి కారణమవుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ పీర్-రివ్యూడ్ జర్నల్ PLOS Pathogens‌లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో మరికొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. గబ్బిలాల కిడ్నీలలో రెండు కొత్త బ్యాక్టీరియా రకాలతో పాటు, “Klossiella yunnanensis” అనే కొత్త పరాన్నజీవిని కూడా గుర్తించారు. ఇది ఇప్పటివరకు ఏ పరిశోధనలోనూ గుర్తించబడలేదు. ఇదంతా చూస్తే గబ్బిలాల్లో సంచరించే సూక్ష్మజీవుల వైవిధ్యం ఎంత విస్తృతంగా ఉందో అర్థమవుతుంది.

నిపుణులు చెబుతున్న మేరకు.. గబ్బిలాల్లో వైరస్‌లు ముందుగా ఎలా అభివృద్ధి చెందుతున్నాయో అధ్యయనం చేయడం ద్వారా భవిష్యత్ మహమ్మారులను ముందుగానే అంచనా వేసే అవకాశం ఉంటుంది. వైరస్‌లు మనుషులకు సోకే ముందు జంతువుల శరీరాల్లో ఎలా మారుతున్నాయో అర్థం చేసుకోవడం ద్వారా, సమర్థవంతమైన నివారణ చర్యలు చేపట్టవచ్చునని సూచిస్తున్నారు.

ఈ అధ్యయనం కేవలం శాస్త్రవేత్తలకు కాదు, ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తోంది. చైనా వంటి దేశాల్లో జంతువుల జీవవైవిధ్యం, మనుషుల జీవనవిధానాలు కలసిపోయే ప్రాంతాల్లో ఇటువంటి వైరస్‌లు ఎలా ఉత్పన్నమవుతున్నాయన్న విషయంపై జాగ్రత్త అవసరం. ఎందుకంటే, ఒకసారి ఇవి మానవుల్లోకి ప్రవేశిస్తే, మరో కొత్త మహమ్మారి రూపంలో మారిపోవడం ఏ మాత్రం ఆశ్చర్యంగా ఉండదు. ఇలాంటి పరిశోధనలు ఇప్పుడు జరగడం సంతోషించదగిన విషయమే కానీ… వాటి ఆధారంగా చట్టపరమైన నియంత్రణలు, ఆరోగ్యశాఖల అప్రమత్తత మరింత అవసరమవుతోంది.